పట్టు వదలని ప్రకాష్ రాజ్ మళ్లీ..

Update: 2015-10-01 07:30 GMT
ప్రకాష్ రాజ్ నటుడు మాత్రమే కాదు.. నిర్మాత - దర్శకుడు కూడా. తమిళంలో డ్యూయెట్ మూవీస్ అనే బేనర్ మీద మంచి మంచి సినిమాలు నిర్మించాడు ప్రకాష్ రాజ్. ఐదేళ్ల కిందట తొలిసారిగా మెగా ఫోన్ పట్టి కన్నడలో ‘నాను నాన్న కనసు’ అనే సినిమా తీశాడు. అది అక్కడ పెద్ద హిట్టు. ఆ తర్వాత నటుడిగా మంచి పేరు సంపాదించిన తెలుగు, తమిళ భాషల్లో రెండు సినిమాలు తీశాడతను. కానీ అవి రెండూ సరైన ఫలితాన్నివ్వలేదు.

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా తీసిన ‘ధోని’ మంచి సినిమాగా పేరు తెచ్చుకున్నా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఇక గత ఏడాది తీసిన ‘ఉలవచారు బిర్యాని’ సినిమాకు పేరూ రాలేదు, డబ్బులూ రాలేదు. ఐతే నటుడిగా ఆరంభంలో ఎదురు దెబ్బలు తిన్నా ప్రకాష్ రాజ్ వెనుకంజ వేశాడా? లేదు కదా. దర్శకత్వంలోనూ అంతే. ఆయన మళ్లీ త్వరలోనే ఇంకో సినిమా డైరెక్ట్ చేయబోతున్నాడు.

ప్రస్తుతం దాదాపు పది సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న ప్రకాష్ రాజ్.. మధ్యలో ఏమాత్రం ఖాళీ దొరికినా తన సొంత స్క్రిప్టు మీద కూర్చుంటున్నాడు. ఈ మధ్య అలా స్క్రిప్టు చర్చల్లో పాల్గొంటూ ట్విట్టర్లో ఓ అప్ డేట్ ఇచ్చాడు ప్రకాష్ రాజ్. దర్శకుడిగా తన తర్వాతి సినిమాకు కథ రెడీ అవుతోందని.. త్వరలోనే సినిమా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నానని చెబుతున్నాడు ప్రకాష్ రాజ్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించబోతున్నాడు విలక్షణ నటుడు.
Tags:    

Similar News