షాకింగ్: ప్రముఖ నటి కుమారుడి క్రెడిట్ కార్డ్ నుంచి 87,000 గోల్ మాల్!
తాజాగా ఆయన క్రెడిట్ కార్డ్ నుంచి రూ. 87,000 అనధికారికంగా డెబిట్ అయినట్లు వెల్లడైంది.;
ఆన్ లైన్ మోసాలకు అంతూ దరీ లేదు! ప్రముఖ టెలివిజన్ హోస్ట్ కం నటి అర్చనా పూరన్ సింగ్, నటుడు పర్మీత్ సేథీ దంపతుల చిన్న కుమారుడు ఆయుష్మాన్ సేథీ ఆన్‌లైన్ క్రెడిట్ కార్డ్ మోసానికి గురయ్యారు. తాజాగా ఆయన క్రెడిట్ కార్డ్ నుంచి రూ. 87,000 అనధికారికంగా డెబిట్ అయినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని ఆయుష్మాన్ అన్న ఆర్యమాన్ సేథీ తన కొత్త వ్లాగ్‌లో షేర్ చేసారు. ప్లేస్టేషన్ ఖాతాకు సంబంధించిన నోటిఫికేషన్ రావడంతో ఈ విషయం బయటపడింది. దీంతో వారి కుటుంబం ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
ఈ మోసం ఎలా జరిగిందనే దానిపై ఆయుష్మాన్ వివరణ ఇస్తూ... ఒక వెబ్‌సైట్‌లో `సెవెన్ డే ఫ్రీ ట్రయల్` ఆప్షన్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు. సాధారణంగా ఏడు రోజుల తర్వాతే డబ్బులు కట్ అవ్వాలి.. కానీ ఆ వెబ్‌సైట్ వారు అనుమతి లేకుండానే ఏడాది మొత్తానికి సరిపడా రూ. 87,000లను ఒకేసారి డెబిట్ చేశారని ఆయన వాపోయారు. తొలుత జీరో డాలర్ లావాదేవీకి మాత్రమే తాను అంగీకారం తెలిపానని.. కానీ గంట తర్వాత భారీ మొత్తంలో డబ్బు మాయమైందని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటనపై తండ్రి పర్మీత్ సేథీ స్పందిస్తూ.. ఆయుష్మాన్ తొందరపాటు వల్లే ఇలా జరిగిందని అనగా... ఆయుష్మాన్ మాత్రం తాను తండ్రి పని చేసే క్రమంలోనే ఈ పొరపాటు జరిగిందని బదులిచ్చారు. ప్రస్తుతం ఈ సమస్యను తానే స్వయంగా పరిష్కరించుకుంటానని.. కస్టమర్ సపోర్ట్ కోసం ప్రయత్నిస్తున్నానని తెలిపారు. అయితే అక్కడ కేవలం ఏఐ (AI) తోనే మాట్లాడాల్సి వస్తోందని అతడు చెప్పడంతో ఇంట్లో నవ్వులు పూశాయి. వారు రిప్లై ఇవ్వడానికి 48 గంటల సమయం పడుతుందని చెప్పడంతో చేసేదేమీ లేక వీడియో గేమ్స్ ఆడుతూ కూర్చున్నానని ఆయన చెప్పారు.
గతంలో కూడా ఆయుష్మాన్ ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఏడాది క్రితం కూడా అతడి ప్లేస్టేషన్ ఖాతా నుంచి సుమారు రూ. 80,000 డెబిట్ అయ్యాయని... ఆ డబ్బు తిరిగి రాలేదని ఆర్యమాన్ గుర్తు చేశారు. దీనిపై వారి కుటుంబ సభ్యులు జోక్ చేస్తూ.. ``ఫ్రాడ్ చేసే వాళ్లకు నువ్వు రెగ్యులర్ కస్టమర్‌గా మారిపోయావు`` అంటూ ఆటపట్టించారు. అయితే గతంలో జరిగినది తన నియంత్రణలో లేని మోసమని అందుకే ఆ డబ్బు వెనక్కి వచ్చిందని ఆయుష్మాన్ క్లారిటీ ఇచ్చారు.
చివరగా పర్మీత్ సేథీ మాట్లాడుతూ.. ఈసారి జరిగినది సాంకేతిక లోపం కాదని.. ఆయుష్మాన్ స్వయంగా బటన్ నొక్కి పర్మిషన్ ఇవ్వడం వల్లే డబ్బు కట్ అయిందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయుష్మాన్ ఆ కంపెనీకి ఈమెయిల్ పంపి.. తన డబ్బును తిరిగి పొందే ప్రయత్నాల్లో ఉన్నారు. సెలబ్రిటీల పిల్లలు కూడా ఇలాంటి డిజిటల్ ట్రాప్స్‌లో పడటం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆన్‌లైన్ సబ్‌స్క్రిప్షన్లు తీసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన మరొకసారి గుర్తు చేస్తోంది. అనవసరమైన యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవడం పెనుముప్పుగా మారుతోందని కూడా విశ్లేషణలు ఉన్నాయి. చాలా యాప్ లు సబ్ స్క్రిప్షన్ సమయం ముగిసాక కూడా కస్టమర్ ఆదమరుపు కారణంగా ఆటో డెబిట్ లో డబ్బు కోల్పోవడం గమనించదగిన పరిణామం. ఇదో తరహా మోసంగాను పరిగణించాలి.