శోభన్ బాబు డెత్ మిస్టరీ.. మనవడు చెప్పిన అసలు విషయం ఇదే..

టాలీవుడ్‌ లో అందగాడిగా, కుటుంబ కథా చిత్రాల హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శోభన్ బాబు మరణంపై ఇప్పటికీ అభిమానుల్లో అనేక డౌట్లు ఉన్నాయి.;

Update: 2026-04-27 08:38 GMT

టాలీవుడ్‌ లో అందగాడిగా, కుటుంబ కథా చిత్రాల హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శోభన్ బాబు మరణంపై ఇప్పటికీ అభిమానుల్లో అనేక డౌట్లు ఉన్నాయి. ఆయన ఎలా మరణించారు? అనేదానిపై ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, తాజాగా ఆయన మనవడు సౌగంధ్ కృష్ణ ఇచ్చిన వివరణతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందించిన సౌగంధ్ కృష్ణ, తన తాత మరణించిన రోజు జరిగిన సంఘటనలను వివరించారు. "ఆ రోజు ఆదివారం. తాత గారికి ఒక్కసారిగా భారీ గుండెపోటు వచ్చింది. అప్పటికి ఆయన రాకింగ్ చైర్‌ లో కూర్చొని పుస్తకం చదువుతున్నారు. గుండెపోటు రావడంతో ముందుకు పడిపోయారు. ఆయన పెట్టుకున్న కళ్లద్దాలు ఒత్తిడికి గురై కట్ అయ్యింది" అని తెలిపారు

"కానీ ఇంకా ఎలాంటి గాయాలు కాలేదు. హార్ట్ ఎటాక్ వల్ల ఆయన కింద పడిపోయారు. ఆ రోజు తాతగారు సాధారణంగా తన పనులు చేసుకున్నారు. వాష్‌ రూమ్‌ కు వెళ్లి రెడీ అయ్యారు. తర్వాత కూర్చుని పుస్తకం చదువుతుండగానే ఈ ఘటన జరిగింది. అప్పటికి ఇంట్లో అందరూ ఉన్నారు" అని వెల్లడించారు. దీంతో ఆయన మరణంపై ఉన్న అనుమానాలకు కొంతవరకు తెరపడినట్టైంది.

కాగా.. తెలుగు ఇండస్ట్రీలో శోభన్ బాబు స్థానం ఎంతో స్పెషల్. 1959లో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఆయన, దాదాపు 40 ఏళ్ల పాటు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. కుటుంబ కథా చిత్రాల్లో ఆయన నటనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. హీరోగా 230కు పైగా సినిమాల్లో నటించి, అనేక హిట్ చిత్రాలు అందించారు. వాటిలో పలు సినిమాలు 100 రోజులకు పైగా ఆడి రికార్డు సృష్టించాయి.

1937లో ఉప్పు సూర్యనారాయణరావు, రమా తులసమ్మ దంపతులకు పుట్టిన శోభన్ బాబు.. ఎప్పుడు డిసిప్లైన్ తో కూడిన లైఫ్ స్టైల్ ను ఫాలో అయ్యేవారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. మంచి ఆహారం, వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం ఎప్పుడూ చేసేవారని తెలిపారు. ఇక ఆయన మరణంపై మరో బంధువు కూడా రీసెంట్ గా కొన్ని విషయాలు వెల్లడించారు.

కుటుంబ బాధ్యతలు చక్కగా చూసుకున్న శోభన్ బాబు, తన చెల్లెళ్లను ఎంతో ప్రేమతో చూసుకున్నారని చెప్పారు. ఆయన చాలా కాలం జీవిస్తానని, 100 సంవత్సరాలు పూర్తి చేస్తానని తరచూ చెప్పుకునేవారట. ఆయన కుటుంబంలో పెద్దలు కూడా ఎక్కువ కాలం జీవించడంతో అదే నమ్మకంతో ఉండేవారని తెలిపారు. అయితే 2008 మార్చి 20న 71 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. మరణించిన రోజు కూడా అందరితో మాట్లాడి, కాఫీ తీసుకురమ్మని చెప్పిన తర్వాత గదిలోకి వెళ్లిన ఆయన, కొద్దిసేపటికే కుప్పకూలిపోయారని చెప్పారు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు.

Tags:    

Similar News