ప్రభాస్‌ కోసం ఎగబడుతున్నారు!

Update: 2015-07-03 08:54 GMT
డార్లింగ్‌ ప్రభాస్‌కి 'బాహుబలి'తో వచ్చిన క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఒక్క హిందీ సినిమా కూడా చేయకపోయినా ఆయన గురించి ఇప్పుడు బాలీవుడ్‌ మొత్తం ఆసక్తికరంగా మాట్లాడుకుంటోంది. తమిళంలోనూ అదే పరిస్థితి. ఆ మాటకొస్తే అన్ని భారతీయ భాషల్లోనూ ప్రభాస్‌ గురించే చర్చించుకొంటున్నారు. 'బాహుబలి' విడుదలయ్యాక హాలీవుడ్‌ వర్గాలు సైతం ప్రభాస్‌ గురించి ఆరా తీసినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు ట్రేడ్‌ పండితులు. ఇటీవల పలు అగ్ర నిర్మాణ సంస్థలు ప్రభాస్‌తో సినిమాలు చేసేందుకు ముందుకొస్తున్నాయి. ఆయనతో ప్రత్యేకమైన ఒప్పందాలు చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఇద్దరు ముగ్గురు కార్పొరేట్‌ నిర్మాతలు ప్రభాస్‌ని వ్యక్తిగతంగా కలుసుకొని ఒప్పందాల గురించి మాట్లాడారట. నిర్మాణ సంస్థలతో పాటు వాణిజ్య సంస్థలు కూడా ప్రభాస్‌ కోసం వస్తున్నాయి. ఆయన్ని బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేసుకొని తమ    ఉత్పత్తులకి ప్రచారం చేయించాలని చూస్తున్నాయి. అయితే ప్రభాస్‌ మాత్రం ఇప్పటికిప్పుడు దేనికీ ఒప్పుకోవడం లేదట. బాహుబలి విడుదలయ్యాకే అన్నింటిగురించీ మాట్లాడుకొందామని అందరికీ సర్దిచెప్పి పంపుతున్నాడట. బాహుబలి విడుదలయ్యాక ప్రభాస్‌ రేంజ్‌ మరింతగా పెరగబోతోందని ట్రేడ్‌ వర్గాలు లెక్కగడుతున్నాయి. ఆయనకి బాలీవుడ్‌ నుంచి భారీగా ఆఫర్లు వెల్లువెత్తే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

Tags:    

Similar News