బాహుబలి-2 కొత్త పోస్టర్ మీదా రగడ..

Update: 2017-02-25 07:40 GMT
దర్శక ధీరుడు రాజమౌళి మీద ఇప్పటికే చాలా కాపీ ఆరోపణలొచ్చాయి. అతడి ప్రతి సినిమాకూ ఏదో ఒక హాలీవుడ్ సినిమాతో ముడిపెడుతుంటారు. ఇక ‘బాహుబలి’ విషయంలో జక్కన్న ఇలాంటి ఆరోపణలు ఎన్ని ఎదుర్కొన్నాడో..? ‘ది బిగినింగ్’కు సంబంధించిన థీమ్ పోస్టర్ (నీళ్లలోంచి చేతితో బిడ్డను ఎత్తుకున్నది) ఓ హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టిందంటూ అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఇప్పుడు శివరాత్రి కానుకగా రిలీజ్ చేసిన ‘బాహుబలి-2’ పోస్టర్ విషయంలోనూ ఇలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. యాక్షన్ హీరో టోనీ జా నటించిన ‘ఆంగ్ బాక్-’ పోస్టర్ దీనికి స్ఫూర్తి అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

ఆంగ్ బాక్-2.. బాహుబలి-2 లేటెస్ట్ పోస్టర్లు రెండూ పక్క పక్కన పెట్టి పోలిక చూపిస్తూ.. రాజమౌళిపై కాపీ ఆరోపణలు చేస్తున్నారు జనాలు. వాళ్ల ఆరోపణలు కొట్టి పారేయదగ్గవేమీ కావు. రెంటికీ పోలికలున్నాయి. రాజమౌళి హాలీవుడ్ సినిమాల్ని కాపీ కొట్టడు కానీ.. స్ఫూర్తి పొందుతాడన్నది వాస్తవం. బేసిక్ ఐడియాను తీసుకుని.. మన నేటివిటీకి తగ్గట్లుగా దాన్ని మలచడంలో.. ఒరిజినల్ కంటే కూడా ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంలో రాజమౌళి దిట్ట. ‘బాహుబలి: ది కంక్లూజన్’ పోస్టర్ కూడా అలాంటిదే. ‘ఆంగ్ బ్యాక్-2’ పోస్టర్ కంటే కూడా ‘బాహుబలి-2’ పోస్టర్ ఎంతో ఆకర్షణీయంగా ఉందన్నది వాస్తవం. కాబట్టి ఈ విషయంలో మరీ రచ్చ చేయాల్సిన అవసరం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News