ఆత్రేయ దుస్థితి గురించి పోసాని..

Update: 2017-09-17 07:37 GMT
రచయితగా 150 సినిమాలకు పని చేసిన ఘన చరిత్ర పోసాని కృష్ణమురళిది. ఐతే దాదాపు దశాబ్ద కాలంగా ఆయన రచన జోలికి వెళ్లట్లేదు. రచన నుంచి దర్శకత్వం వైపు వచ్చిన ఆయన.. ఆ తర్వాత నటుడిగా స్థిరపడ్డారు. పోసాని తీరు.. జోరు చూస్తుంటే ఆయన మళ్లీ రైటింగ్ వైపు వెళ్లేలా కనిపించట్లేదు. ఈ విషయమే ఆయన్ని అడిగితే.. ఆల్టర్నేట్ కెరీర్ లేకపోవడం వల్ల ఎంతోమంది పేరున్న రచయితలు కూడా ఒక దశ దాటాక ఎంత కష్టపడిందీ గుర్తు చేసుకున్నాడు. తన గురువులైన పరుచూరి సోదరుల దగ్గర పని చేసేటపుడే డిమాండ్ తగ్గాక రచయితల పరిస్థితి ఎలా ఉంటుందో చూసి తాను ఆలోచనలో పడ్డట్లు పోసాని చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన ఆత్రేయ దుస్థితిని గుర్తు చేసుకున్నారు.

‘‘ఆత్రేయ గారు గొప్ప రచయిత. ఐతే జీవిత చరమాంకంలో ఆయన అవకాశాల కోసం అడుక్కునే పరిస్థితితో ఉండటం చాలా బాధ కలిగించింది. నేను పరుచూరి బ్రదర్స్ దగ్గర పని చేస్తున్నపుడు నాలుగు వేలిచ్చినా చాలు.. అవకాశం ఇవ్వండి అని నాతో అన్నారు. ఆత్రేయ గారు పరుచూరి వారిని కలవడానికి వస్తున్న సమయంలో నేను వెంకటేశ్వరరావు గారితో విషయం చెప్పాను. అందుకాయన ‘ఆత్రేయగారు చాలా పెద్ద రైటర్‌. ఆయన్ని మనకు అసిస్టెంటుగా పెట్టుకుంటే చాలా హీనంగా మాట్లాడతారు. అలాగని పని చేయించకుండా నాలుగు వేలిస్తే ఆయన్ని తక్కువ చేసినట్లవుతుంది. అందుకే ఎవరైనా ఆత్రేయ గారికి సన్మానం చేస్తే ఆ సందర్భంలో విలువైన బహుమతులు ఇవ్వాలి తప్ప విడిగా డబ్బులివ్వడం బాగుండదు’ అన్నారు. తర్వాత అలాంటి సాయమేదో చేశారు. అలాగే మద్దిపట్ల సూరి అని మరో రైటర్ ఇబ్బంది పడుతుంటే ‘ప్రాణ మిత్రుడు’ అనే సినిమాకి మూడు వేలు ఇచ్చి ఒక వెర్షన్‌ రాయమన్నారు పరుచూరి బ్రదర్స్. ఆయన రాసిందేమీ వాడలేదు. పని చేయించుకోకుండా డబ్బులిస్తే వాళ్లను అవమానపరిచినట్లవుతుందని అలా చేశారు. ఇవన్నీ చూశాక నేను అలాంటి దయనీయ స్థితిలో ఉండకూడదని.. ఆల్టర్నేట్ కెరీర్ చూసుకున్నాను’’ అని పోసాని తెలిపాడు.
Tags:    

Similar News