పవన్ కళ్యాణ్ రూల్స్ బ్రేక్ చేసేశాడే..

Update: 2018-08-19 11:19 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014లో ట్విట్టర్ అరంగేట్రం చేశాడు. మొదట్లో అతను ఏమంత యాక్టివ్ గా ఉన్నది లేదు. తన సినిమా ముచ్చట్లేమీ పంచుకునేవాడు కాదు. వేరే విషయాల గురించి కూడా స్పందించింది తక్కువ. కానీ తర్వాత తర్వాత తన రాజకీయ ఉద్దేశాలు చాటి చెప్పడానికి.. పార్టీ సంగతులు పంచుకోవడానికి ట్విట్టర్ అకౌంట్ ను వేదికగా చేసుకున్నాడు. ఈ క్రమంలో ఫాలోవర్లు కూడా పెరిగారు. ఈ మధ్యే పవన్ 3 మిలియన్ మార్కును కూడా దాటాడు. ప్రస్తుతం అతడి వెనుక 32 లక్షల మంది ఫాలోవర్లుండటం విశేషం. కానీ చిత్రమైన విషయం ఏంటంటే.. పవన్ మొన్నటిదాకా ట్విట్లర్లో ఇంకెవరినీ ఫాలో కాలేదు. తాను ఎవరినీ అనుసరించకూడదని రూల్ ఏమైనా పెట్టుకున్నాడో ఏమో తెలియదు కానీ.. సినిమా వాళ్లను కానీ.. రాజకీయ రంగానికి చెందిన వాళ్లను కానీ.. ఇంకెవరిని కానీ అనుసరించకుండా ఉండిపోయాడు.

కానీ ఎట్టకేలకు పవన్ తనకు తాను గీసుకున్న గీత నుంచి బయటికి వచ్చాడు. తొలిసారిగా ఒక సెలబ్రెటీని అనుసరించడం మొదలు పెట్టాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు.. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్. బిగ్-బి తన అభిమాన నటుడని పవన్ గతంలోనే చాలాసార్లు చెప్పాడు. కానీ ఆయన్ని కూడా ఇంతకాలం అనుసరించలేదు. ఐతే పవన్ తాజాగా ఒక తమిళ రచయిత రాసిన దేశభక్తి కవిత ఇంగ్లిష్ అనువాదాన్ని ట్విట్టర్లో పంచుకున్నాడు. తాను తరచుగా ఈ కవితలు చదువుతుంటానని తెలిపాడు. ఈ ట్వీట్ ను అమితాబ్ బచ్చన్ రీట్వీట్ చేయడం విశేషం. అది చూసి పవన్ అమితానందానికి గురయ్యాడు. అమితాబ్ కు కృతజ్ఞతలు చెప్పాడు. అంతే కాక బిగ్-బిని అనుసరించడం కూడా మొదలు పెట్టాడు. ఎలాగూ నియమావళిని ఉల్లంఘించేశాడు కాబట్టి.. ఇకపై మరింత మందిని పవన్ అనుసరిస్తాడేమో చూడాలి.


Tags:    

Similar News