టాలీవుడ్ లో సొంత ప్రివ్యూ థియేట‌ర్లు ఎవ‌రెవ‌రికి?

Update: 2021-08-28 10:30 GMT
టాలీవుడ్ లో సొంత ప్రివ్యూ థియేట‌ర్లు ఉన్న సెల‌బ్రిటీలు ఎంద‌రు? అంటే ఆల్మోస్ట్ ఆ న‌లుగురు సహా అగ్ర హీరోలంద‌రికీ సొంత థియేట‌ర్లు ఉన్నాయి. త‌మ సినిమాల రిలీజ్ ముందే ప్రివ్యూ వీక్ష‌ణ కోసం కొంద‌రు ఈ త‌ర‌హా సెట‌ప్ చేసుకున్నారు. మారుతున్న అడ్వాన్స్ టెక్నాల‌జీతో ప్రొజెక్ట‌ర్ల ఏర్పాటు.. డిజిట‌ల్ వీక్ష‌ణ సులువు అవ్వ‌డంతో ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రూ థియేట‌ర్ల‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు.

విక్ట‌రీ వెంక‌టేష్ .. ద‌గ్గుబాటి రానా- ద‌గ్గుబాటి సురేష్ బాబు బృందం హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో రామానాయుడు ప్రివ్యూ థియేట‌ర్ ను ఏర్పాటు చేసుకుంది. ఇందులో త‌మ సినిమాల్ని వీక్షించ‌డ‌మే గాక‌.. ఇత‌రుల సినిమాల ప్రివ్యూల కోసం అద్దెకిస్తారు. ఘ‌ట్ట‌మ‌నేని సినిమాల కోసం ప‌ద్మాల‌యాలో ఈ సెట‌ప్ ఉండేది .. కానీ ఆ స్టూడియో ఇప్పుడు లేదు. అందువ‌ల్ల సూప‌ర్ స్టార్ మ‌హేష్ త‌న ఇంట్లోనే ఓ థియేట‌ర్ ని ఏర్పాటు చేసుకుని అందులో సినిమాలు వీక్షిస్తుంటారు. ఇవ‌న్నీ డాల్బీ డిజిట‌ల్ అట్మాస్ వంటి అధునాత‌న సౌండ్ టెక్నాల‌జీతో అనుసంధానించ‌బ‌డిన‌వి కాబ‌ట్టి రియ‌ల్ థియేట‌ర్ వీక్ష‌ణ అనుభూతిని ఆస్వాధించ‌వ‌చ్చు.

సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న రాత్రి సుధీర్ బాబు `శ్రీదేవి సోడా సెంటర్` చూశారు. ఆ స‌మ‌యంలో మ‌హేష్ సినిమా చూస్తున్న ఫోటో తీసి సుధీర్ బాబు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ బాబు తన హోమ్ థియేటర్ లో సినిమా చూస్తున్నారని అర్థ‌మ‌వుతోంది. ఫిలింన‌గ‌ర్ లోని త‌మ‌ ఇంట్లోనే మినీ థియేట‌ర్ ఇది. పెద్ద స్క్రీన్ విలాసవంతమైన సీటింగ్ తో క‌నిపిస్తోంది. సెలబ్రిటీలు తమ ఇళ్ల వద్ద థియేటర్ ల వంటి థియేటర్లను ఏర్పాటు చేసుకునేందుకు అస్స‌లు వెన‌కాడ‌డం లేదు.

అక్కడ కొత్త సినిమాలు థియేటర్లకు వెళ్లకుండా నేరుగా ప్రదర్శించుకునేందుకు ఆస్కారం ఉంది. మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చ‌ర‌ణ్ త‌దిత‌రులు సొంత థియేట‌ర్లో ప్రివ్యూలు వీక్షిస్తుంటారు. అల్లు కాంపౌండ్ కి గీతా ఆర్ట్స్ లోనే థియేట‌ర్ ఏర్పాటు ఉంది. ఇక్క‌డే సినిమాల్ని వీక్షించి రివ్యూలు చేస్తుంటారు. దివంగ‌త ద‌ర్శ‌క‌దిగ్గ‌జం దాస‌రి ఇంట్లోనూ సొంత థియేట‌ర్ ని ఏర్పాటు చేసుకున్నారు. డార్లింగ్ ప్ర‌భాస్.. ఎన్టీఆర్ స‌హా ప్ర‌తి ఒక్క‌రూ మినీ థియేట‌ర్ లా హోంథియ‌ట‌ర్ల‌ను ఏర్పాటు చేసుకుని చూడాల‌నుకున్న కొత్త సినిమాల్ని వీక్షిస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో లార్జ్ సైజ్ ఎల్ఈడీ టీవీలు ఎల్ సీడీల్లో సినిమాల వీక్ష‌ణ ఆల్మోస్ట్ థియేట్రిక‌ల్ ఎక్స్ పీరియెన్సెనే ఇస్తున్నాయి. పెరిగుతున్న‌ సాంకేతిక‌త వినోదరంగంలో ప్ర‌తిదీ మార్చేస్తోంది.

సొంత థియేటర్లు లేనివాళ్లు ప్రివ్యూలు ఎక్క‌డ చూస్తారు? అంటే థియేట‌ర్ లో వేసే ప్రివ్యూల‌కు వెళుతుంటారు. కొంద‌రు నిర్మాత‌ల మండ‌లి కార్యాల‌యంలో ప్రివ్యూ థియేట‌ర్ లో కానీ లేదా ఫిలింఛాంబ‌ర్ లోని మినీ ప్రివ్యూ థియేట‌ర్లో కానీ సినిమాల ప్రివ్యూల్ని వీక్షిస్తుంటారు. ఈ థియేట‌ర్ల కోసం రూ.5000- రూ.10000 ఒక ప్ర‌ద‌ర్శ‌న‌కు చెల్లించాల్సి ఉంటుంది. రామానాయుడు థియేట‌ర్.. శ‌బ్ధాల‌యా థియేట‌ర్.. ప్ర‌సాద్ లాబ్స్ లో థియేట‌ర్ల‌కు అద్దెలు చెల్లించి ప్రివ్యూలు వేస్తుంటారు. వీటిని నిర్మాత‌లే ఏర్పాటు చేస్తుంటారు. ప‌లువురు ప్ర‌ముఖుల‌కు త‌మ సినిమాల రిలీజ్ ల వేళ టిక్కెట్లు అంద‌జేసి కుటుంబ స‌మేతంగా ప్రివ్యూకి రావాల్సిందిగా నిర్మాత‌లు కోరుతుంటారు. అలా ఇంట్లో థియేట‌ర్లు ఉన్న హీరోలు కూడా మ‌ల్టీప్లెక్సుల‌కు వెళ్లి ప్రివ్యూలు వీక్షిస్తుంటారు.




Tags:    

Similar News