'వీరమల్లు' ప్లేస్ లో '#PSPKRana'.. పవన్ చిత్రాల ఆర్డర్ మారుతోందా?

Update: 2021-07-09 03:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లోని రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో నటిస్తున్న 'హరి హర వీరమల్లు'.. సాగర్ కె.చంద్ర తో చేస్తున్న 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' తెలుగు రీమేక్.. రెండూ ఇప్పటికే 40 శాతానికి పైగా పూర్తయ్యాయి. ఏఎమ్ రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.దయాకర్ రావు 'వీరమల్లు' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కెరీర్ లోనే ఫస్ట్ హిస్టారికల్ మూవీగా.. భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేసి.. రానా దగ్గుబాటి తో కలిసి చేస్తున్న '#PSPKRana' చిత్రాన్ని ఆగస్ట్ లో రిలీజ్ చేయాలని పవన్ ప్లాన్స్ చేసుకున్నారు. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చి ప్లాన్స్ అన్నీ తారుమారు చేసింది.

పవన్ కళ్యాణ్ కు కరోనా వైరస్ సోకడంతో 'హరి హర వీరమల్లు' 'ఏకే' రీమేక్ ల షూటింగ్స్ నిలిపివేశారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో కొంతకాలం మళ్ళీ చిత్రీకరణ ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో 'హరి హర వీరమల్లు' సినిమా వచ్చే సంక్రాంతి కి వచ్చే అవకాశం లేదని వార్తలు వచ్చాయి. అయితే నిర్మాత ఏఎమ్ రత్నం మాత్రం ఈ వార్తలను ఖండిస్తూ చెప్పిన సమయానికి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ సెట్ లో షూట్ చేయాల్సిన సినిమా.. గ్రాఫిక్స్ వర్క్ కు ఎక్కువ అవకాశమున్న చిత్రాన్ని హడావుడిగా పూర్తి చేయకూడదని భావిస్తున్నారట. అందుకే పవన్ తో సినిమాలు చేస్తున్న ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూర్చొని మాట్లాడుకొని ఓ పరిష్కారానికి వచ్చారట.

అదేంటంటే.. 'హరి హర వీరమల్లు' చిత్రాన్ని సంక్రాంతి రేసు నుంచి తప్పించి.. అదే సమయానికి '#PSPKRana' సినిమాని రిలీజ్ చేస్తే బాగుంటుందని ఓ నిర్ణయానికి వచ్చారట. అందుకే ముందుగా జూలై 12న సితార ఎంటర్టైన్మెంట్స్ లో చేస్తున్న సినిమా షూటింగ్ ను ప్రారంభించి.. ఆగస్ట్ నెలాఖరుకు కంప్లీట్ చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది. 'ఏకే' రీమేక్ సంక్రాంతి పండుగ సీజన్ లో వస్తే.. 'వీరమల్లు' 2022 సమ్మర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీని వల్ల పవన్ పాన్ ఇండియా చిత్రానికి వీఎఫ్ఎక్స్ వర్క్ - పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసుకోడానికి కావల్సినంత సమయం దొరుకుతుంది. మరి రాబోయే రోజుల్లో పవన్ లైనప్ లో మరిన్ని మార్పులు చోటు చేసుకుంటాయేమో చూడాలి.
Tags:    

Similar News