రెహమాన్ కామెంట్స్.. టాలీవుడ్ నిర్మాత ఏమన్నారంటే?
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల చేసిన కామెంట్స్ బాలీవుడ్ లో పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.;
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల చేసిన కామెంట్స్ బాలీవుడ్ లో పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. హిందీ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు మార్పులు జరుగుతున్నాయని, తనకు అక్కడ అవకాశాలు తగ్గడానికి మతపరమైన వివక్ష ఒక కారణం కావచ్చని ఆయన అన్న మాటలు వివాదస్పదంగా మారాయి. ఇప్పుడు ఆ కామెంట్స్ పై టాలీవుడ్ నిర్మాత, మ్యూజిక్ లేబుల్ యజమాని మధుర శ్రీధర్ రెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు.
సినీ పరిశ్రమలో మార్పులు సహజమని, వాటిని వేరే కోణంలో చూడాల్సిన అవసరం లేదని ఆయన సుదీర్ఘ పోస్ట్ లో రాసుకొచ్చారు. ప్రతి ఆర్టిస్ట్ ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉండరని మధుర శ్రీధర్ రెడ్డి చెప్పారు. సంగీత దర్శకులైనా, నటులైనా, సాంకేతిక నిపుణులైనా .. కొన్నేళ్లు మంచి అవకాశాలు వస్తాయని, మరికొన్ని సంవత్సరాలు అవకాశాలు తగ్గుతాయని తెలిపారు. ఇది తెలుగు, తమిళ, బాలీవుడ్ పరిశ్రమల్లో ఎప్పటినుంచో జరుగుతున్న నార్మల్ ప్రాసెస్ అని అన్నారు.
జెనరేషన్స్ మారుతుంటాయని, అందుకే ప్రేక్షకుల అభిరుచులు కూడా కాలానుగుణంగా మారుతాయని చెప్పారు. బడ్జెట్ సమస్యలు, సినిమా తీసే విధానాల్లో మార్పులు, కొత్త ట్రెండ్స్ రావడం వంటి కారణాలతో అవకాశాలు తగ్గడం సహజమేనని వివరించారు. గత పది సంవత్సరాలలో డిజిటల్ మ్యూజిక్ రావడంతో పరిస్థితి మొత్తం మారిపోయిందని తెలిపారు. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ ఫామ్ ల ద్వారా ఎంతోమంది యువ సంగీత దర్శకులు వస్తున్నారని అన్నారు.
అందువల్ల నిర్మాతలు కొత్త ప్రతిభకు కూడా అవకాశాలు ఇస్తున్నారని చెప్పారు. బడ్జెట్, ప్రాఫిట్స్, ప్రేక్షకుల చేరువ వంటి అంశాలు కూడా ఇప్పుడు ముఖ్యంగా మారాయని తెలిపారు. బాలీవుడ్ లో ఒకే సినిమాకు పలువురు సంగీత దర్శకులు పని చేయడం సాధారణమైందని చెప్పారు. పాటలకు ఒకరు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు మరొకరు ఉండటం ఇప్పుడు సాధారణ విధానమని తెలిపారు. ఇది పరిశ్రమలో వచ్చిన మార్పే తప్ప, ఎవరి మీద వివక్ష చూపడం లేదని స్పష్టం చేశారు.
దానికి మతపరమైన కారణాలకు ఆపాదించడం సరికాదని మధుర శ్రీధర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రేక్షకులు, అన్ని మతాల వారు రెహమాన్ సంగీతాన్ని ఎన్నో ఏళ్లుగా అభిమానిస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పటికీ ఆయన పెద్ద హీరోలు, ప్రముఖ నిర్మాణ సంస్థలతో పని చేస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు సంగీత ప్రపంచంలో ఇళయరాజా అగ్రస్థానంలో ఉన్నప్పుడు తరువాత తరం ఏఆర్ రెహమాన్ ను ఆదరించిందని అన్నారు.
దాని అర్థం ఇళయరాజాను తిరస్కరించారని కాదని చెప్పారు. జెనరేషన్స్ ముందుకు వెళ్తున్నాయన్నదానికి ఇది ఉదాహరణ మాత్రమేనని తెలిపారు. అందుకే గుర్తింపు సంపాదించుకున్న ఆర్టిస్ట్ లు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలని మధుర శ్రీధర్ రెడ్డి అన్నారు. పరిశ్రమలో జరిగే సహజ మార్పులు అర్థం చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉందని, మాటలకు విలువ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ వైరల్ గా మారింది.