అంచనాలు తలకిందులు.. అవసరమా పుష్ప?
ఈ మధ్య కాలంలో అమెరికాతో పాటు జపాన్‌లో కూడా ఇండియన్ సినిమాలు మంచి వసూళ్లు రాబడుతున్న విషయం తెల్సిందే.;
ఈ మధ్య కాలంలో అమెరికాతో పాటు జపాన్‌లో కూడా ఇండియన్ సినిమాలు మంచి వసూళ్లు రాబడుతున్న విషయం తెల్సిందే. అయితే జపనీస్ భాషలో మన సినిమాలను డబ్ చేసి అక్కడ విడుదల చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో బాహుబలితో పాటు ఆర్‌ఆర్‌ఆర్, కల్కి మరికొన్ని సినిమాలు జపాన్‌లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కొన్ని సినిమాలు మరీ దారుణంగా కూడా విఫలం అయ్యాయి అది వేరే విషయం. అయితే పెద్ద హీరోల సినిమాలు జపాన్‌లో మినిమం గ్యారెంటీ అన్నట్లుగా ఓపెనింగ్స్‌ను రాబడుతున్నాయి. జపాన్‌లో ఇప్పటి వరకు అత్యధికంగా బాహుబలి సినిమా రాబట్టినట్లుగా బాక్సాఫీస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. జపాన్‌లో ఎక్కువ రోజులు సినిమాలు ఆడుతూ మంచి రెవిన్యూ తెచ్చి పెడుతున్నాయి. అందుకే చాలా మంది హీరోలు, ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాలను అక్కడ విడుదల చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
పుష్ప 2 సినిమాతో జపాన్ కి...
ఇండియాలో విడుదలై చాలా కాలం అయిన తర్వాత జపాన్‌లో విడుదల కావడం మనం చూస్తూ ఉన్నాం. ఇతర సినిమాల మాదిరిగానే జపాన్‌లో పుష్ప 2 సినిమా విడుదల అయింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2 సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఎన్నో రికార్డ్‌లను సొంతం చేసుకుంది. ఇదే సమయంలో పుష్ప 2 సినిమాను జపాన్‌లో విడుదల చేస్తే తప్పకుండా వర్కౌట్ అవుతుందని, పైగా సినిమాలో జపాన్ ఎపిసోడ్ సైతం ఉండటం కలిసి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ మొత్తం రివర్స్ అయింది. అంచనాలు తారుమారు అయ్యాయి. మేకర్స్ అనుకున్నట్లుగా కాకుండా మొత్తం తలకిందులు అయ్యాయి. జపాన్ లో పుష్ప 2 సినిమాను విడుదల చేసి చాలా పెద్ద తప్పు చేశారు అనే విధంగా అక్కడి నెంబర్స్ నమోదు అవుతున్నాయి.
ఆర్‌ఆర్‌ఆర్, కల్కి సినిమాల ఫస్ట్ డే రెస్పాన్స్...
పుష్ప 2 సినిమాకు మొదటి రోజున కేవలం 886 టికెట్లు మాత్రమే అమ్ముడు పోయాయి అని స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. సాధారణంగా విదేశీ భాషల సినిమాలకు అక్కడ ఓపెనింగ్ తక్కువగానే ఉంటుంది. కానీ మరీ ఇంత తక్కువగా ఉండటంను మేకర్స్ జీర్ణించుకోలేక పోతున్నారు. గతంలో విడుదలైన ఆర్‌ఆర్‌ఆర్, కల్కి, సాహో సినిమాలు జపాన్‌లో భారీగా మొదటి రోజు టికెట్లు అమ్ముడు పోయాయి. కానీ ఇప్పుడు పుష్ప 2 సినిమాకు మరీ తక్కువ టికెట్లు అమ్ముడు పోవడంతో లాంగ్ రన్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకు జపాన్ లో విడుదలైన తెలుగు సినిమాల్లో ఏ ఒక్క సినిమా కూడా వెయ్యి లోపు మొదటి రోజు టికెట్లను నమోదు చేయలేదు. కేవలం పుష్ప 2 మాత్రమే వెయ్యి కంటే తక్కువ టికెట్ల నెంబర్ ను నమోదు చేయడం జరిగింది. పుష్ప 2 సినిమాను సరైన సమయంలో విడుదల చేయలేదని కొందరు అంటూ ఉంటే కొందరు మాత్రం సినిమాలో మ్యాటర్ లేదని తేల్చేస్తున్నారు.
అల్లు అర్జున్, రష్మిక మందన్న పుష్ప 2
జపాన్ సినీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా పుష్ప 2 సినిమా లేదేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్న ఈ సమయంలోనే మరికొందరు మాత్రం సినిమా కచ్చితంగా లాంగ్ రన్‌లో నడువబోతుందని అంటున్నారు. వచ్చే వీకెండ్ వరకు జపాన్ లో పుష్ప 2 సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరగడం, తద్వారా సినిమాకు మంచి వసూళ్లు నమోదు కావడం జరగబోతుంది అంటూ అల్లు అర్జున్ అభిమానులు ఇప్పటికీ నమ్మకంగా ఉన్నారు. సినిమాకు జపాన్ లో సరైన ప్రచారం లేక పోవడం వల్లే మొదటి రోజు ఓపెనింగ్ సరిగ్గా పడలేదని, సినిమాకు వచ్చే మౌత్ టాక్, సోషల్ మీడియా టాక్ కారణంగా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందనే విశ్వాసంను మేకర్స్ సైతం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమాలో శ్రీలీల ఐటెం సాంగ్ చేయడం జరిగింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాంటి సినిమాను జపాన్ లో విడుదల చేసి పరువు పోగొట్టుకోవడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు అల్లు ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.