'జనతా గ్యారేజ్'లో హీరో నేను కాదు - ఎన్టీఆర్

Update: 2016-08-28 12:04 GMT
ఇదేం మాట చిత్రంగా ఉందే అనిపిస్తోందా.. ఐతే ఎన్టీఆర్ ఈ మాటే నొక్కి వక్కాణిస్తున్నాడు. తాను ఇందులో హీరో కాదు అని. అలాగని మోహన్ లాల్ కూడా ఇందులో హీరో కాదట. అసలు ఇందులో ఏ నటుడూ హీరో కాదట. జనతా గ్యారేజే ఇందులో హీరో అని.. తామందరం ఆ హీరోకు సహకారం మాత్రమే అందించామని ఎన్టీఆర్ చెప్పాడు. "జనతా గ్యారేజ్ చుట్టూనే ఈ కథ సాగుతుంది. కాబట్టి నేను కానీ.. మోహన్ లాల్ గారు కానీ.. ఇందులో హీరోలం కాదు. ఆ గ్యారేజే ఇందులో హీరో. జనతా గ్యారేజ్ కథే నన్ను కానీ.. మోహన్ లాల్ గారినీ కానీ ఈ సినిమా కోసం ఎంచుకుంది. ఈ సినిమాకు ఇంతమంది గొప్ప నటీనటులు.. టెక్నీషియన్లు సమకూరడం కూడా ఆ స్క్రిప్టే కారణం. కొరటాల శివ గారి విల్ పవర్ వల్లే మేమందరం ఒక్కటయ్యాం. ఐతే మమ్మల్నందరినీ ఎంచుకుంది మాత్రం జనతా గ్యారేజే. అదే ఈ సినిమాకు హీరో" అని ఎన్టీఆర్ అన్నాడు.

మోహన్ లాల్ తో పని చేయడం గురించి మాట్లాడుతూ.. "ఒక నటుడిగా ఆయన గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు. నేను ఆ కోణంలో మాట్లాడితే ఆయన్ని కించపరిచినట్లే అవుతుంది. నేను ఆయన వ్యక్తిత్వం గురించి మాత్రమే మాట్లాడతాను. తన కోసం ఒక చిన్న కుర్చీ ఏర్పాటు చేసినా చాలు సంతృప్తి పడిపోయే మనిషి ఆయన. ఏ విషయంలోనూ అసంతృప్తి ఉండదు. ఆ స్థాయి వ్యక్తి అంత సింపుల్ గా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రతి విషయంలోనూ ఆయన సంతోషం వెతుక్కుంటారు. నటనలో.. తిండిలో.. ఇలా ప్రతి విషయంలోనూ హ్యాపీనెస్ చూస్తారు. నేను ఆయన్నుంచి నేర్చుకున్నది అదే. అలాంటి గొప్ప వ్యక్తితో కలిసి పని చేయడం నా అదృష్టం. ఇలాంటి అవకాశం కల్పించినందుకు కొరటాల శివకు నేను కృతజ్నుడిని" అని ఎన్టీఆర్ చెప్పాడు.
Tags:    

Similar News