షాక్ లో ఉన్నాను.. మాటలు రావడం లేదు: ఎన్టీఆర్

Update: 2021-10-12 08:20 GMT
టాలీవుడ్ నిర్మాత మహేష్ కోనేరు కన్నుమూశారు. ఈరోజు (అక్టోబర్ 12) మంగళవారం ఉదయం విశాఖపట్నంలో ఆయన గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. మహేష్ ఎంతో కాలంగా జూనియర్ ఎన్టీఆర్​ - కల్యాణ్​ రామ్​ లకు పీఆర్​ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. మహేష్ తుదిశ్వాస విడిచారనే వార్త తెలుసుకున్న తారక్​ ఎమోషనల్ ట్వీట్ చేశారు. తన ఆప్త మిత్రుడు మహేశ్ కోనేరు మృతి వార్త తెలిసి షాక్ కు గురయ్యానని పేర్కొన్నారు.

''బరువెక్కిన హృదయంతో చెబుతున్నా.. నా ఆప్త మిత్రుడు మహేష్ కోనేరు ఇక లేరు. నేను షాక్ లో ఉన్నాను. నాకు మాటలు రావడం లేదు. మహేశ్ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను'' అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అలానే నందమూరి కల్యాణ్​ రామ్ ట్వీట్ చేస్తూ.. ''పూర్తిగా షాక్ లో ఉన్నాను. ఇది నమ్మలేకపొతున్నాను. నా స్నేహితుడు, కుటుంబ సభ్యులు మరియు శ్రేయోభిలాషి అయిన మహేష్ కోనేరు ఇక లేరు. ఆయన మాకు వెన్నెముక లాంటి వారు. నాకు వ్యక్తిగతంగానూ మరియు మొత్తం పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చనిది'' అని పేర్కొన్నారు.

నిర్మాత కోనేరు మహేష్ మృతి పై టాలీవుడ్ సినీ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ - డైరెక్టర్ మారుతి - రచయిత కోన వెంకట్ తదితరులు కోనేరు మృతి కి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. మహేష్ ఆకస్మిక మరణం ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ లతో పాటుగా నందమూరి అభిమానులకు కూడా తీరని లోటని చెప్పాలి. డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్ గా కెరీర్ ఆరంభించిన కోనేరు.. ఆ తర్వాత సినిమాలకు పి.ఆర్.వో గా పని చేశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ లకు వ్యక్తిగత పీఆర్ గా కొనసాగుతున్నారు.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగా కూడా మారారు మహేష్ కోనేరు. కల్యాణ్ రామ్ తో '118' - సత్యదేవ్ హీరోగా 'తిమ్మరుసు' - కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో 'మిస్ ఇండియా' వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. తమిళ హీరో విజయ్ నటించిన 'మాస్టర్' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ప్రస్తుతం అల్లరి నరేష్ తో 'సభకు నమస్కారం' చిత్రంతో పాటుగా కళ్యాణ్ రామ్ - సందీప్ కిషన్ లతో సినిమాలు నిర్మిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా స్వస్థలం వైజాగ్ వెళ్ళిన మహేశ్ కోనేరు గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది.
Tags:    

Similar News