అటు 'ఆర్ ఆర్ ఆర్' ఇటు సల్మాన్ ఏది పెద్ద ఈవెంట్!

Update: 2021-12-20 07:25 GMT
ఎన్టీఆర్ మంచి మాటకారి .. అవతలివారిని పడగొట్టేసే చతురుడే. తడుముకోవడం .. తడబడటం ఆయనకి తెలియదు. చెప్పదలచుకున్న విషయాన్ని ఎంత ఘాటుగా చెప్పగలడో .. సరదా మాటల్లో అంతే సమయస్ఫూర్తిని చూపగలడు. నిన్న జరిగిన 'ఆర్ ఆర్ ఆర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను ఆయన తన మాటకారితనాన్ని చూపించాడు. రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' అత్యంత భారీ ప్రాజెక్టుగా తయారైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను జనవరి 7వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ముంబైకి సమీపంలోని 'గురుకుల్ మైదాన్'లో జరిగింది. రాజమౌళి .. ఎన్టీఆర్ .. చరణ్ .. అలియా భట్ .. శ్రియతో పాటు, కరణ్ జొహార్ కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యాడు. ఇక ఈ వేడుకకు చీఫ్ గెస్టుగా సల్మాన్ వచ్చాడు. సల్మాన్ లో మంచి సమయస్ఫూర్తి ఉందనే విషయం అందరికి తెలిసిందే. అలాగే ఆయన ఒకసారి పరిచయమైనవారితో చాలా దూరం ప్రయాణం చేస్తాడు. అందుకుకారణం ఫ్రెండ్షిప్ విషయంలో ఆయన తన స్టార్ డమ్ ను తీసి పక్కకి పెట్టడమేనని అంటారు.

చరణ్ .. ఎన్టీఆర్ ల గురించి ఆయన చాలా బాగా మాట్లాడాడు. చరణ్ తో సల్మాన్ కి మంచి స్నేహం ఉంది. చరణ్ బాలీవుడ్ వెళ్లినప్పుడు ఆయనకి సంబంధించిన వ్యవహారాలను సల్మాన్ దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. అలాగే సల్మాన్ హైదరాబాద్ వస్తే చరణ్ ను కలవకుండా వెళ్లడు. అలాంటి ఒక మంచి స్నేహం ఆ ఇద్దరి మధ్య ఉంది. ఇక చరణ్ తో పోలిస్తే సల్మాన్ తో ఎన్టీఆర్ కి పరిచయం తక్కువే. అయినా ఎన్టీఆర్ గురించి సల్మాన్ ఎంతో చనువు తీసుకుని ఈ ఈవెంట్లో మాట్లాడాడు. ఆయన మంచి ఆర్టిస్ట్ అంటూ ప్రశంసలు కురిపించాడు.

ఇక ఎన్టీఆర్ మాట్లాడుతూ .. "నాకు ఒక విషయం అర్థం కావడం లేదు .. ఒక వైపున 'ఆర్ ఆర్ ఆర్' ఈవెంట్ .. మరో వైపున నేను సల్మాన్ పక్కనే నుంచుని ఉన్నాను. ఈ రెండింటిలో ఏది పెద్ద ఈవెంట్ అనుకోవాలి? అంటూ చమత్కరించాడు. సల్మాన్ తో స్టేజ్ షేర్ చేసుకోవడమే తనకి పెద్ద ఈవెంట్ అనే అర్థం వచ్చేలా ఎన్టీఆర్ మాట్లాడిన తీరు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది తన కెరియర్లోనే ఒక అందమైన జ్ఞాపకం అంటూ సల్మాన్ పట్ల ఎన్టీఆర్ చూపిన అభిమానం, ఇకపై వాళ్లిద్దరినీ కూడా మంచి స్నేహితులుగా ఉంచుతుందనడంలో ఆశ్చర్యం లేదు.


Tags:    

Similar News