కపుల్ ఫ్రెండ్లీకి ‘A’ సర్టిఫికేట్.. అసలు కారణం చెప్పిన ధీరజ్!
సెన్సార్ బోర్డ్ 'ఫ్రెండ్లీ కపుల్' అని పేరు మార్చుకోమని సలహా ఇచ్చినా, కథకు ఆ ఫీల్ రాదని తను తిరస్కరించినట్లు ధీరజ్ చెప్పారు.;
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ గురించి నిర్మాత ధీరజ్ మొగిలినేని రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్‌లో కొన్ని కీలకమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా సెన్సార్ బోర్డ్ నుంచి వచ్చిన 'A' సర్టిఫికేట్ మీద ఆయన ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
సాధారణంగా ఒక సినిమాకు 'A' సర్టిఫికేట్ వచ్చిందంటే అందులో సీన్లు లేదా డైలాగులు ఇబ్బందికరంగా ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ ఈ సినిమా విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని ధీరజ్ వివరించారు. సినిమాలో ఉన్న కంటెంట్ వల్ల కాకుండా, కేవలం తాము పెట్టిన 'కపుల్ ఫ్రెండ్లీ' అనే టైటిల్ వల్లే సెన్సార్ బోర్డ్ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ టైటిల్ వినడానికి కాస్త తేడాగా ఉందనేది సెన్సార్ సభ్యుల అభిప్రాయమట.
ఇక ఈ టైటిల్‌ను బోర్డ్ సభ్యులు ఒక 'బూతు' లాగా ఫీలయ్యారని, అందుకే 'A' సర్టిఫికేట్ ఇచ్చారని ధీరజ్ వెల్లడించారు. టైటిల్ మార్చుకుంటే 'U/A' ఇస్తామని వారు ఆఫర్ చేసినా, తను మాత్రం దానికి ఒప్పుకోలేదని ఆయన స్పష్టం చేశారు. లాస్ట్ మినిట్‌లో టైటిల్ మారిస్తే ఆడియన్స్‌కు కన్ఫ్యూజన్ వస్తుందని, అందుకే అదే టైటిల్‌తో ముందుకు వెళ్లాలని తను నిర్ణయించుకున్నట్లు ఆయన మీడియా ముందు క్లారిటీ ఇచ్చారు.
సినిమాలో ఎక్కడా అసభ్యకరమైన సీన్లు లేవని, ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథ అని ధీరజ్ హామీ ఇచ్చారు. శివ, మిత్ర అనే ఇద్దరు వ్యక్తుల జర్నీతో పాటు వారి కుటుంబాల మధ్య ఉండే బాండింగ్ ఈ సినిమాలో మెయిన్ హైలెట్ అని ఆయన పేర్కొన్నారు. కేవలం టైటిల్ చూసి ఇది ఏదో 'ఓయో రూమ్స్' సినిమా అని జడ్జ్ చేయవద్దని, థియేటర్లో సినిమా చూశాక ఇది ఎంత క్లీన్ ఫిల్మ్ అనేది అందరికీ అర్థమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సెన్సార్ బోర్డ్ 'ఫ్రెండ్లీ కపుల్' అని పేరు మార్చుకోమని సలహా ఇచ్చినా, కథకు ఆ ఫీల్ రాదని తను తిరస్కరించినట్లు ధీరజ్ చెప్పారు. "మా సినిమాలో హీరోకి అన్నయ్య, వదిన.. హీరోయిన్ కి అక్క, బావ ఇలా ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఉంటుంది. ఇది అందరూ కలిసి చూడదగ్గ సినిమా" అని ఆయన వివరించారు. టైటిల్ విషయంలో బోర్డ్ పెట్టిన కండిషన్స్ వల్ల 'A' సర్టిఫికేట్ తీసుకోవాల్సి వచ్చిందే తప్ప, సినిమాలో అలాంటి కంటెంట్ లేదని ఆయన మాటలను బట్టి క్లియర్ గా తెలుస్తోంది.
ఇక నైజాంలో సొంతంగా రిలీజ్ చేస్తున్న ఈ సినిమాపై ధీరజ్ చాలా నమ్మకంతో ఉన్నారు. 'కపుల్ ఫ్రెండ్లీ' అనే టైటిల్ ఆల్రెడీ జనాలోకి వెళ్ళిపోయిందని, అందుకే సర్టిఫికేట్ ఏదైనా సరే అదే పేరుతో వస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. మరి వాలెంటైన్స్ డే రోజున ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.