షాకింగ్ అప్ డేట్... ఈ ఇరానియన్ 'చివరి' విజ్ఞప్తిని ట్రంప్ స్వీకరిస్తే..!
గత ఏడాది డిసెంబర్ లో ఇరాన్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు పెద్ద ఎత్తున జరిగిన సంగతి తెలిసిందే.;
గత ఏడాది డిసెంబర్ లో ఇరాన్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు పెద్ద ఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. అవి కాస్తా తీవ్ర హింసాత్మకంగా మారడంతో వేల మరణాలు సంభవించాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారులపై తుపాకీలు ఎక్కుపెడితే తాను రంగంలోకి దిగాల్సి వస్తుందనే సౌండ్ తో వార్నింగ్ ఇచ్చారు. ఈ సమయంలో.. ఓ ఇరానియన్ ఆత్మహత్యకు ముందు ట్రంప్ కు ఓ కీలక విజ్ఞప్తి చేశారు! ఇది కాస్తా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది!
అవును... ఇరాన్ తో ఒప్పందం కుదుర్చుకోవద్దని, ఆ దేశంతో చర్చలు వద్దని, వారిపై దాడి చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని కోరుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ అయ్యింది. అయితే.. ఈ వీడియో పోస్ట్ చేసిన ఇరానియన్ వ్యక్తి ఆత్మహత్యకు ముందు దీన్ని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. సుమారు 10:44 నిమిషాలు ఉన్న ఈ వీడియోలో ఉన్న వ్యక్తి.. ఇరాన్ దక్షిణ ఓడరేవు నగరం బుషెహర్ నివాసి, హక్కుల కార్యకర్త పౌరియా హమీదీగా గుర్తించినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ట్రంప్ ని ఉద్దేశించిన మాట్లాడిన హమీదీ... ఈ వీడియోను మీరు చూసే సరికి తాను సజీవంగా ఉండకపోవచ్చని.. ఇరాన్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలను ఎంత ఘోరాతి ఘోరంగా అణిచివేశారో ప్రపంచానికి తెలియాలని.. ఇక్కడ మారణహోమం జరిగిందని.. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కంటే.. ఇజ్రాయెల్ - పాలస్తీనా వార్ కంటే ఎక్కువగా సుమారు 40,000 మంది చంపబడ్డారని, ఊచకోత కోయబడ్డారని, మరణించారని తెలిపారు.
"ఇది నా త్యాగం.. దయచేసి నా దేశాన్ని విడిపించండి" అనే క్యాప్షన్ తో ఉన్న ఈ వీడియోలో... ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీతో ఏదైనా దౌత్య ఒప్పదం చేసుకుంటే అది మరణించినవారందరినీ ద్రోహం చేసినట్లే అవుతుందని హమీదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్ప్పుడు తమ నమ్మకమంతా అమెరికా మీదే ఉందని.. ఇరాన్ తో ఎలాంటి సంప్రదింపులూ జరపవద్దని.. ఆ దేశంపై దాడి చేయాలని.. హమీదీ ఆ వీడియోలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను అభ్యర్థించాడు! అది అతని "చివరి" అభ్యర్థన!
ఇదే సమయంలో... ఇరాన్ పై అమెరికా దాడి చేయడం తమకున్న ఏకైక ఆశ అని చెప్పిన హమీదీ.. ఈ పాలనతో మనం ఒంటరిగా పోరాడలేమని.. మన ప్రజలకు విదేశీ (అమెరికా!) జోక్యం అవసరమని అన్నారు. ఈ సందర్భంగా.. ఆ దేశం నుంచి బహిష్కరించబడిన యువరాజు రెజా పహ్లావికి ప్రస్థావన తెస్తూ... దేశంలో ఓ పరివర్తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన ఒక ఉత్తమ ఎంపిక అని హమీది తన వీడియోలో వెల్లడించారు.
దీంతో... ఈ ఇరానియన్ చివరి విజ్ఞప్తిని అమెరికా అధ్యక్షుడు స్వీకరించి, అతని మరణం, అతని చివరి కోరికను మన్నిస్తే... పశ్చిమాసియా మరోసారి అట్టుడికిపోయే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు... నిరసనల తర్వాత ఇరాన్ తన అణిచివేతను, అరెస్టులను ముమ్మరం చేస్తూనే... అమెరికాకు చర్చల కోసం తలుపులు తెరిచి ఉంచినట్లు ప్రకటించడం గమనార్హం.