నైజాంలో సొంత ఆఫీస్.. అసలు విషయం చెప్పిన ధీరజ్
టాలీవుడ్ లో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ధీరజ్ మొగిలినేని రీసెంట్ గా నైజాం మార్కెట్ పై ఫోకస్ పెట్టారు.;
టాలీవుడ్ లో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ధీరజ్ మొగిలినేని రీసెంట్ గా నైజాం మార్కెట్ పై ఫోకస్ పెట్టారు. సంతోష్ శోభన్, మానస వారణాసి లీడ్ రోల్స్ లో నటిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ ఎంటర్టైనర్ కపుల్ ఫ్రెండ్లీ మూవీని నైజాంలో సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే కొత్త ఆఫీస్ కూడా ప్రారంభించారు. ఇప్పుడు ఆ మూవీ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తన నిర్ణయం వెనుక కారణాలు వివరించారు.
ధీరజ్ మాట్లాడుతూ.. నైజాం తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ అని, డిస్ట్రిబ్యూటర్ గా సినిమా రిలీజ్ చేసినప్పుడు అసలు రెవెన్యూ ఎక్కువగా ఇక్కడి నుంచే వస్తుందని చెప్పారు. కమీషన్ బేసిస్ పై సినిమాలు రిలీజ్ చేస్తే నిర్మాతకు ఆశించిన లాభాలు రావని, అందుకే కపుల్ ఫ్రెండ్లీ సినిమాను పూర్తిగా సొంతంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు పరోక్షంగా తెలిపారు.
"నైజాంలో ఈ సినిమాపై నాకు చాలా నమ్మకం ఉంది. అందుకే ఎవరికీ రైట్స్ ఇవ్వకుండా ఓన్ రిలీజ్ చేస్తున్నా. కమిషన్ ఎక్కువగా ఇతరులకు వెళ్లిపోతే మాకు మిగిలేది ఏమీ ఉండదు. అందుకే సొంతంగా రిలీజ్ చేస్తే లాభం ఉంటుంది" అని స్పష్టం చేశారు. ఆ తర్వాత తన జర్నీలో మద్దతుగా నిలిచిన పలువురిని ధీరజ్ గుర్తు చేసుకున్నారు.
రాజు గారు, శిరీష్ గారు తనకు ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నారని, అరవింద్ గారితో కూడా కలిసి పనిచేశానని చెప్పారు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ రవి, శశి, అన్నపూర్ణ సుప్రియ, సాయి బాబా వంటి పలువురు తనకు క్లోజ్ అని, ఎవరికీ తనతో ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. తాను సినిమాను సొంతంగా రిలీజ్ చేస్తానంటే అందరూ సపోర్ట్ చేశారని చెప్పారు.
"ఇది పూర్తిగా నా పర్సనల్, బిజినెస్ డెసిషన్ మాత్రమే" అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే మైత్రీ మూవీ మేకర్స్ తో కూడా చర్చలు జరిగాయని, కానీ కమిషన్ విషయంలో క్లారిటీ రాకపోవడంతో రైట్స్ ఇవ్వలేదని చెప్పారు. "మెజారిటీ కమిషన్ వాళ్ళకి వెళ్తే నాకు మిగిలేది తక్కువ. అందుకే ఈసారి నేను సొంతంగా రిలీజ్ చేస్తున్నా" అని అన్నారు.
కపుల్ ఫ్రెండ్లీ సినిమాపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఇది కచ్చితంగా మంచి హిట్ అవుతుందని ధీరజ్ ధీమా వ్యక్తం చేశారు. "హిట్ అయితే ఆ లాభాలు మాకే రావాలి. అందుకే ఆశతో, కొంచెం స్వార్థంతో రిలీజ్ చేస్తున్నా" అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు. మొత్తానికి నైజాం మార్కెట్ లో సొంత డిస్ట్రిబ్యూషన్ తో ముందుకెళ్తున్న ధీరజ్ మొగిలినేని నిర్ణయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి కపుల్ ఫ్రెండ్లీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అవుతుందో.. ధీరజ్ ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.