ఈసారి ఛాంబ‌ర్ నాలుగు సెక్టార్ల ఎన్నిక‌లు

Update: 2019-07-05 17:30 GMT
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల త‌ర్వాత‌ నిర్మాత‌ల మండ‌లి ఎన్నిక‌లు పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. ఆర్టిస్టుల ఎన్నిక‌ల త‌ర‌హాలో నిర్మాత‌ల ఎన్నిక‌లు అంత ర‌స‌వ‌త్త‌రంగా జ‌ర‌గ‌క‌పోవ‌డంపై చ‌ర్చ సాగింది. ఈసారి నిర్మాత‌ల గిల్డ్ 50 మంది స‌భ్యులు ఎన్నిక‌ల్లో పాల్గొన‌క‌పోవ‌డంతో నిర్మాత‌ల ఎన్నిక‌లు చ‌ప్ప‌గా సాగాయి. సి.క‌ళ్యాణ్ అధ్యక్షుడిగా ఎన్నిక‌య్యారు. ఆర్టిస్టులు.. నిర్మాత‌ల ఎన్నిక‌లు అయిపోయాయి. ఇక నెక్ట్స్ ఏంటి? అని అడిగితే.. ఈసారి ఫిలిం ఛాంబ‌ర్ నాలుగు సెక్టార్ల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

2019-21 సీజ‌న్ కు తెలుగు చ‌ల‌న‌చిత్ర వాణిజ్య మండ‌లి (ఫిలింఛాంబ‌ర్) కార్య‌వ‌ర్గ స‌భ్యులు- మండ‌లి నాలుగు విభాగాల (సెక్ట‌ర్లు) స‌భ్యుల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు రంగం సిద్ధ‌మైంది. ఆ మేర‌కు జూన్ 27న జ‌రిగిన కార్య‌వ‌ర్గ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు. జూలై 27న స‌ర్వ‌స‌భ్య స‌మావేశం (జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్) స‌హా అదే రోజు హైద‌రాబాద్ లో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని ఫిలింఛాంబ‌ర్ వ‌ర్గాలు నోటిఫికేష‌న్ ని జారీ చేశాయి. 08 జూలై (సోమ‌వారం) నుంచి 12 జూలై వ‌ర‌కూ పూర్తి చేసిన నామినేష‌న్ల‌ను హైద‌రాబాద్ ఫిలింఛాంబ‌ర్ లో స్వీక‌రిస్తారు. 12 జూలై మ‌ధ్యాహ్నం ఒంటిగంట‌కు అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టిస్తారు. 19 జూలై 2గం.ల‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు. అదే రోజు 2 గంట‌ల త‌ర్వాత ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాని ప్ర‌క‌టిస్తారు. ఎన్నిక‌ల్లో పాల్గొనే లేదా స‌ర్వ‌స‌భ్య స‌మావేశానికి హాజ‌రయ్యే స‌భ్యులంతా త‌ప్ప‌నిస‌రిగా గుర్తింపు కార్డును తేవాల్సి ఉంటుంది. అది పాత కార్డు లేదా కొత్త కార్డు ఏదైనా చెల్లుబాటు అవుతుంది. ఆ మేర‌కు ఛాంబ‌ర్ వ‌ర్గాలు వివ‌రాల్ని అందించాయి. నామినేష‌న్ వేసేందుకు ఫారం ఖ‌రీదై రూ.500 గా నిర్ణ‌యించారు.

నాలుగు సెక్టార్ల ఎన్నిక‌లు అంటే.. డిస్ట్రిబ్యూట‌ర్- ఎగ్జిబిట‌ర్- నిర్మాత‌లు- స్టూడియో య‌జ‌మానులు ఇందులో ఉంటారు. వీళ్లంద‌రి కోసం రెండేళ్ల కోసారి ఎన్నిక‌లు జ‌రుగుతుంటాయి. దీని నుంచే ఛాంబ‌ర్ కార్య‌వ‌ర్గ స‌భ్యుల్ని ఎన్నుకుంటారు.

    

Tags:    

Similar News