బాలీవుడ్‌లో 'అత్యంత దారుణమైన విషయం' ఇదే
ఒక సినిమాలో నలుగురు ప్రధానమైన స్టార్లు ఉంటే వారితో పాటు దాదాపు 40 నుండి 60 మంది సహాయకులు సెట్స్‌పైనే తిష్టవేస్తున్నారని ఈ ఫేమస్ సౌత్ డైరెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.;
బాలీవుడ్ షూటింగుల్లో విచిత్రమైన పరిస్థితి గురించి సీనియర్ డైరెక్టర్ ఒకరు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిగ్గా మారాయి. ఆయన ప్రకారం.. సెట్స్‌పై పరివారం హద్దు మీరుతున్నారనే ఆవేదన బహిర్గతమైంది. ఆయన ఎవరు అనేది అటుంచితే.. ఈ ఘటనల వివరాల్లోకి వెళితే...
బాలీవుడ్ లో ప్రస్తుతం కొనసాగుతున్న సంస్కృతిపై ఒక ఫేమస్ సౌత్ డైరెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నటీనటులు తమతో పాటు సెట్స్‌కు తీసుకువచ్చే భారీ వ్యక్తిగత సిబ్బంది వల్ల షూటింగ్ వాతావరణం ఎంతలా దెబ్బతింటోందో ఆయన వివరించారు. మేకప్ ఆర్టిస్టులు, పర్సనల్ మేనేజర్లు, వంటవాళ్లు, జిమ్ ట్రైనర్లు వంటి పెద్ద బృందంతో నటులు సెట్స్‌కు రావడం బాలీవుడ్‌లో తాను చూసిన ``అత్యంత దారుణమైన విషయం`` అని ఆయన అభివర్ణించారు.
ఒక సినిమాలో నలుగురు ప్రధానమైన స్టార్లు ఉంటే వారితో పాటు దాదాపు 40 నుండి 60 మంది సహాయకులు సెట్స్‌పైనే తిష్టవేస్తున్నారని ఈ ఫేమస్ సౌత్ డైరెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల దర్శకుడికి అసలు కెమెరా ఫ్రేమ్ కూడా సరిగ్గా కనిపించని పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. అవసరం లేకపోయినా పదే పదే జుట్టు సర్దడం వంటి పనుల నెపంతో వీరంతా షాట్ మేకింగ్ సమయంలో కెమెరా ముందు గుమిగూడటం వల్ల...ప్రతిసారీ `ప్లీజ్ క్లియర్` అని అడుక్కోవాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు.
సినిమా నిర్మాణం కోసం తాను ఏర్పాటు చేసుకున్న మొత్తం సెటప్ కంటే ఈ నటీనటుల వ్యక్తిగత హంగులే ఎక్కువగా ఉంటున్నాయని ఈ దర్శకుడు విమర్శించారు. మరీ ముఖ్యంగా వ్యక్తిగత సిబ్బంది సంపాదన ఎంత ఎక్కువగా ఉందంటే.. గతంలో అస్రానీ వంటి దిగ్గజ నటులకు ఇచ్చే పారితోషికం కంటే వీరే ఎక్కువ తీసుకుంటున్నారని అతడు వెల్లడించారు. అనుభవజ్ఞులైన నటుల కంటే అసిస్టెంట్లకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం.. ఆశించినంత డబ్బు లభించడం పరిశ్రమలోని లోపాలను ఎత్తిచూపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
దక్షిణాది సినిమాలతో పోలిస్తే బాలీవుడ్‌లో ఈ పరిస్థితి మరీ ఘోరంగా ఉందని ఈ ఫేమస్ సౌత్ డైరెక్టర్ గుర్తుచేశారు. దక్షిణాదిలో కూడా ఇలాంటి వ్యక్తిగత సహాయకులు ఉంటారు కానీ.. వారు షూటింగ్ జరిగేటప్పుడు సెట్‌కు దూరంగా ఉంటారని తెలిపారు. నటులు పిలిస్తే తప్ప వారు లోపలికి రారని.. కానీ ముంబైలో మాత్రం అందరూ సెట్‌లోనే తిరుగుతూ పనికి అడ్డంకిగా తగులుతారని మండిపడ్డారు.
తన తదుపరి చిత్రం లో దివంగత నటుడు అస్రానీతో కలిసి పనిచేశానని.. 2025లో అతడు కన్నుమూయడంతో ఇది తమ కలయికలో వచ్చిన చివరి సినిమాగా మిగిలిపోనుందని ఈ ప్రముఖ దర్శకుడు భావోద్వేగానికి గురయ్యారు. ఒక గొప్ప నటుడితో పనిచేసిన అనుభవానికి... నేటి తరం నటుల చుట్టూ ఉండే అనవసరపు హడావుడికి మధ్య ఉన్న తేడాను ఆయన తన మాటల్లో స్పష్టంగా వివరించారు.