సౌత్‌లో డిసిప్లిన్… బాలీవుడ్‌లో గందరగోళం? వైర‌ల‌వుతున్న డైరెక్ట‌ర్ కామంట్స్

ఈ సమస్యకు మరో కీలక కోణం ఖర్చులు. ప్రస్తుత పరిస్థితిలో, నటుల కంటే వారి వెంట వచ్చే సిబ్బందికే ఎక్కువ పారితోషికం చెల్లించాల్సి వస్తోందని ప్రియదర్శన్ పేర్కొన్నారు.;

Update: 2026-04-05 14:30 GMT

సినిమా రంగంలో స్టార్ కల్చర్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా నటీనటుల వెంట సెట్స్‌కు వచ్చే భారీ సిబ్బంది అంశంపై ప్రముఖ దర్శకుడు ప్రియ‌ద‌ర్శ‌న్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీశాయి. ఒక్కో నటుడి వెంట 40 నుంచి 60 మంది వరకు వస్తున్నారు… ఇది అసలు పని చేసే వాతావరణాన్ని దెబ్బతీస్తోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీకి తెరలేపాయి.

ప్రియదర్శన్ చెప్పిన దాని ప్ర‌కారం, ఈ ఎంటరేజ్ కల్చర్ కేవలం హడావిడిగానే కాకుండా, షూటింగ్ ప్రాసెస్‌ను నెమ్మదింపజేస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. అంద‌రూ సెట్స్ లోకి రావ‌డం వ‌ల్ల త‌న కెమెరా ఫ్రేమ్ కూడా కనిపించడం లేద‌ని ఆయన చెప్పడం ద్వారా డైరెక్ట‌ర్ గా ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్పష్టంగా వ్యక్తం చేశారు. మేకప్ టచ్-అప్స్, చిన్న చిన్న అవసరాల పేరుతో సెట్స్ చుట్టూ పెద్ద సంఖ్యలో సిబ్బంది తిరిగి పని మీద దృష్టి మరల్చేస్తున్నారని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు.

రెమ్యూన‌రేష‌న్ కంటే ఆ ఖ‌ర్చే ఎక్కువ‌

ఈ సమస్యకు మరో కీలక కోణం ఖర్చులు. ప్రస్తుత పరిస్థితిలో, నటుల కంటే వారి వెంట వచ్చే సిబ్బందికే ఎక్కువ పారితోషికం చెల్లించాల్సి వస్తోందని ప్రియదర్శన్ పేర్కొన్నారు. గతంలో లెజెండరీ నటుడు ఆస్రాని వంటి వారికి కూడా తక్కువ రెమ్యునరేషన్ ఉండేదని గుర్తు చేస్తూ, ప్రస్తుతం పరిస్థితులు ఎలా మారిపోయాయో ఆయన సూచించారు. దీనివల్ల సినిమాల బడ్జెట్‌లు గణనీయంగా పెరుగుతున్నాయని ఆయ‌న ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక బాలీవుడ్ మరియు సౌత్ సినీ ఇండ‌స్ట్రీ మధ్య వ‌ర్కింగ్ క‌ల్చ‌ర్ తేడాల‌పై కూడా ఆయన వ్యాఖ్యానించారు. సౌత్ ఇండస్ట్రీలో నటీనటుల సిబ్బంది సెట్ బయటే ఉండి, అవసరమైతే మాత్రమే లోపలికి వస్తారని, కానీ బాలీవుడ్‌లో మాత్రం సెట్స్ మధ్యలోనే పెద్ద ఎత్తున గుంపులు ఉండటం సాధారణమైందని చెప్పారు. ఈ తేడా పని సామర్థ్యంపై ప్రభావం చూపుతోందని ఆయన చెప్పారు.

ఈ పరిణామాల మధ్య, ఎంటరేజ్ నిజంగా అవసరమా? అనే ప్రశ్న కూడా ముందుకు వస్తోంది. ప్రొఫెషనల్ అవసరాల కోసం పరిమిత సిబ్బంది ఉండటం సమంజసమే కానీ, అవసరం లేని అదనపు హడావిడి మాత్రం ప్రొడక్షన్‌కు భారంగా మారుతోంది. ఇదిలా ఉండగా, పాత తరంతో పోల్చితే ఈ మార్పులు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు సింపుల్ సెటప్‌తో, తక్కువ సిబ్బందితో సినిమాలు తెరకెక్కించేవారని, ఇప్పుడు లగ్జరీ, వ్యక్తిగత సౌకర్యాలు ప్రాధాన్యం పొందుతున్నాయని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తానికి, ప్రియదర్శన్ చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తిగత అభిప్రాయంగా కాకుండా, మొత్తం ఇండస్ట్రీలో కొనసాగుతున్న స్టార్ కల్చర్ పై పెద్ద డిబేట్‌కు నాంది పలికాయి.

Tags:    

Similar News