అంచ‌నాలు ఇమేజ్‌ను వ‌దిలి స్టార్లు బ‌య‌ట‌కు రావాలి

ఆర్య‌, హ్యాపీలో బ‌న్నీని `పుష్ప‌` సినిమాలో చూడ‌లేదు. అదే విధంగా ఇత‌ర స్టార్లు కూడా త‌మ న‌ట‌నా వైవిధ్యాన్ని ప్ర‌ద‌ర్శించాల్సి ఉంటుంది.;

Update: 2026-04-05 23:30 GMT

ఒక నటుడు లేదా న‌టి నిర్దిష్టమైన ఐకానిక్ పాత్రలో (ఉదాహరణకు సీతాదేవిగా లేదా ఒక మాస్ హీరోగా) ప్రేక్షకులను మెప్పించినప్పుడు వారి మనసుల్లో ఆ ఇమేజ్ బలంగా ముద్ర పడిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో ఆ ఇమేజ్‌ను చెరిపేసి కొత్త పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకోవడం అనేది నటీన‌టుల‌కు ఒక సవాల్‌తో కూడుకున్న పని. ప్రేక్షకులు ఆ నటి లేదా న‌టుడిని చూడగానే పాత పాత్ర తాలూకు భావోద్వేగాలను వెతుక్కుంటారు కాబట్టి కొత్త పాత్రలో వారు చేసే చిన్న పొరపాటైనా కొన్నిసార్లు విమర్శలకు దారితీస్తుంది. ఈ ఇమేజ్ చ‌ట్రం నుండి బయటపడటానికి తార‌లు తమ నటనలో మునుపటి కంటే భిన్నమైన బాడీ లాంగ్వేజ్ , సంభాషణ శైలిని ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆర్య‌, హ్యాపీలో బ‌న్నీని `పుష్ప‌` సినిమాలో చూడ‌లేదు. అదే విధంగా ఇత‌ర స్టార్లు కూడా త‌మ న‌ట‌నా వైవిధ్యాన్ని ప్ర‌ద‌ర్శించాల్సి ఉంటుంది.

అయితే ఈ మార్పు కేవలం నటుడి ప్రతిభపైనే కాకుండా ప్రధానంగా దర్శకుడి విజన్ - స్క్రీన్‌ప్లేపై ఆధారపడి ఉంటుంది. ఒక నటుడి పాత ఇమేజ్‌ను ప్రేక్షకులు మర్చిపోయేలా చేయడంలో దర్శకుడి పాత్ర అత్యంత కీలకం. పాత్ర స్వభావాన్ని మలిచే విధానం.. కథలో ఆ పాత్రకు ఇచ్చే ప్రాధాన్యత.. ప్రేక్షకులను కథలో లీనం చేసే బలమైన సన్నివేశాలు ఉంటే పాత ఇమేజ్ నెమ్మ‌దిగా మరుగున పడిపోతుంది. ఉదాహరణకు ఒక సాఫ్ట్ పాత్రలో స్థిరపడిన నటుడిని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూపించాలంటే.. దర్శకుడు రాసుకునే పాత్ర చిత్రణ చాలా బలంగా ఉండాలి.

ఇమేజ్‌ను మార్చుకోవడం అనేది స్టార్ లేదా దర్శకుడి సమష్టి కృషి. నటీన‌టులు తన మునుపటి పాత్రల ఛాయలు క‌నిపించ‌కుండా వైవిధ్యమైన నటనను కనబరిస్తే.. దర్శకుడు ఆ స్టార్ లోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించే కథాబలాన్ని అందించాలి. కేవలం నటన బాగుండి కథలో పస లేకపోయినా లేదా కథ బాగుండి నటుడు పాత శైలిలోనే నటించినా ఆశించిన ఫలితం దక్కదు. ఈ రెండూ సరిగ్గా కుదిరినప్పుడే నటీనటులు తమ పాత ఇమేజ్ నుండి విజయవంతంగా బయటపడి కొత్త గుర్తింపును సొంతం చేసుకోగలరు.

ఇప్పుడు సీతారామం, హాయ్ నాన్న లోని ఐకానిక్ పాత్ర‌ల ప్ర‌భావం త‌న‌పై బ‌లంగా ప‌డింద‌ని చెబుతున్న మృణాల్ ఠాకూర్ కూడా పై అంశాల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. ఒకే ఇమేజ్ చ‌ట్రంలో చిక్కుకుని అవే ఆలోచ‌న‌ల‌తో ఉండిపోవ‌డం వ‌ల్ల కెరీర్ కి చాలా న‌ష్టం జ‌రుగుతుంద‌ని మృణాల్ గ్ర‌హించాల్సి ఉంటుంది. చాలా పెద్ద బ్యాన‌ర్లు, ఆఫ‌ర్లు వ‌చ్చినా క‌మ‌ర్షియ‌ల్ సినిమా అనే కోణంలో వ‌దులుకున్నాన‌ని మృణాల్ తెలిపారు. ఈ రోజుల్లో డ‌బ్బు రాబ‌ట్టుకునేందుకు అలాంటివి చేయాల్సి రావొచ్చు.. అలాగే రిలేష‌న్ షిప్ కోసం కూడా కొన్నిటిని కాద‌నుకోకూడ‌దు.

కేవలం డబ్బు లేదా పెద్ద బ్యానర్ల కోసం కాకుండా.. తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకోవాలనుకుంటున్నట్లు మృణాల్ తన తాజా ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కానీ దీనిని చాలా మంది నెటిజ‌నులు వ్య‌తిరేకిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మాటలకు చేస్తున్న సినిమాలకు పొంతన లేదని కొందరు విమర్శిస్తున్నారు. మృణాల్ ఇటీవల నటించిన `సన్ ఆఫ్ సర్దార్ 2`, `దో దీవానే షెహర్ మే` వంటి హిందీ సినిమాలు నాణ్యత పరంగా గానీ.. బాక్సాఫీస్ వద్ద గానీ పెద్దగా ప్రభావం చూపలేదని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ప్రాక్టిక‌ల్ గా మృణాల్ అనుకున్న‌ది సాధ్య‌ప‌డ‌కపోవ‌చ్చ‌ని హిత‌వు ప‌లుకుతున్నారు. తెలుగు ఫిలింమేక‌ర్స్ ని టార్గెట్ చేస్తూ ఇలాంటి అభిప్రాయం వ్య‌క్తం చేసి ఉంటే, ఆలోచ‌న మార్చుకోవాల‌ని కూడా సూచిస్తున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే మృణాల్ న‌టించిన డెకాయిట్ విడుద‌ల‌కు రానుంది. ఇందులో గూఢ‌చారి ఫేం అడివి శేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని పాన్ ఇండియాలో విడుద‌ల చేయ‌నున్నారు.

Tags:    

Similar News