నైజాం థియేట‌ర్లు డిసెంబ‌ర్ నుంచి రీఓపెన్

Update: 2020-11-09 08:30 GMT
తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1600 పైగా థియేట‌ర్లు ఉన్నాయి. ఒక‌ప్పుడు సుమారు 2500 వ‌ర‌కూ థియేట‌ర్లు ఉంటే ఇటీవ‌ల చాలా వ‌ర‌కూ క‌ళ్యాణ మంట‌పాలుగా గొడౌన్లుగా మారిపోయాయ‌న్న రిపోర్ట్ ఎగ్జిబిట‌ర్ వ‌ర్గాల నుంచి అందింది. థియేట‌ర్ల వ్యాపారం లాభ‌సాటిగా లేక‌పోవ‌డంతో ఇత‌ర వ్యాపారాల వైపు మ‌ళ్లిస్తున్నార‌న్న ఆవేద‌న రెగ్యుల‌ర్ గా క‌నిపించేదే.

ఇక మూలిగే న‌క్క‌మీద తాటిపండులా క‌రోనా మ‌హ‌మ్మారీ థియేట‌ర్ రంగాన్ని పూర్తిగా దెబ్బ కొట్టింది. పులిమీద పుట్ర‌లా స‌వారీ చేస్తూ ఈ రంగంలో ప‌ని చేసే ఉద్యోగులంద‌రినీ రోడ్డుకీడ్చింది.

ఇక థియేట‌ర్లు తెరుచుకునేందుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసినా రాష్ట్రాల్లో ఏ నిర్ణ‌యం తీసుకోని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఏపీలో థియేట‌ర్లు తెరుచుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తించేయ‌గా తెలంగాణ‌లో మాత్రం కేసీఆర్ ప్ర‌భుత్వం వేచి చూసే ధోర‌ణిని అవ‌లంబించింది. ఎట్ట‌కేల‌కు ఇక్క‌డా థియేట‌ర్లు తెరుచుకునేందుకు అనుమ‌తులు ఇస్తామ‌ని కేసీఆర్ ఇటీవ‌ల సినీపెద్ద‌ల‌తో స‌మావేశంలో ప్ర‌క‌టించారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ డిసెంబ‌ర్ నుంచి తెలంగాణ‌లో థియేట‌ర్లు తెరుచుకోనున్నాయి. త్వ‌ర‌లోనే జీవో కూడా జారీ కానుంది. ఇప్ప‌టికే ఎగ్జిబిట‌ర్లు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని భ‌త్ర‌తా నియ‌మాలు పాటిస్తూ జ‌నాల సేఫ్టీని పాటించాల్సి ఉంటుంది. అయితే సెకండ్ టైర్ సిటీల్లో టాయ్ లెట్లు అయినా క‌డిగించేందుకు ఇష్ప‌డ‌ని సింగిల్ థియేట‌ర్ య‌జ‌మానులు ఇప్పుడు అయినా మార‌తారా లేదా? అన్న విమ‌ర్శ‌లు లైట్ గా వినిపిస్తున్నాయ్.
Tags:    

Similar News