కమ్ బ్యాక్ కు విశ్వప్రసాద్ రెడీ? లైనప్ తో గట్టి ఆన్సర్?
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొందరు నిర్మాతలు మాత్రమే తమ ప్రత్యేక గుర్తింపుతో ముందుకు సాగుతుంటారు.;
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొందరు నిర్మాతలు మాత్రమే తమ ప్రత్యేక గుర్తింపుతో ముందుకు సాగుతుంటారు. అలాంటి అరుదైన నిర్మాతల్లో టీజీ విశ్వప్రసాద్ ఒకరు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతగా ఆయన తనదైన శైలిలో సినిమాలు నిర్మిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. విదేశాల్లో స్థిరపడి ఉన్నప్పటికీ సినిమాలపై ఉన్న ఆసక్తితో తిరిగి వచ్చి నిర్మాణ రంగంలో అడుగు పెట్టారు.
ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న ఆయన, తన కుమార్తె కీర్తి ప్రసాద్ ను కూడా భాగస్వామిగా చేసుకుని సంస్థను మరింత విస్తరిస్తున్నారు. అయితే ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన రాజాసాబ్ చిత్రం ఊహించని విధంగా పరాజయం పాలైంది. పాన్ ఇండియా ప్రభాస్ స్టార్ ఉన్నప్పటికీ ఆ సినిమా భారీగా నష్టాలను విశ్వప్రసాద్ కు మిగిల్చింది. దాదాపు రూ.100 కోట్ల వరకు నష్టం వాటిల్లిందనే అంచనాలు వినిపించాయి.
దీంతో విశ్వప్రసాద్ కెరీర్ పై అనుమానాలు వ్యక్తం చేసిన వారు కూడా ఉన్నారు. కానీ ఆ విమర్శలకు సమాధానంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. కచ్చితంగా గట్టి సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. 2027 సంవత్సరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ సంస్థ పలు క్రేజీ ప్రాజెక్టులను సిద్ధం చేస్తోంది.
గత ఏడాది యంగ్ హీరో తేజ సజ్జాతో తెరకెక్కించిన మిరాయ్ తో మంచి విజయాన్ని సాధించిన ఆ సంస్థ.. ఇప్పుడు అదే స్థాయిలో కాకుండా మరింత భారీ స్థాయిలో ఒక ఫిక్షన్-యాక్షన్ మూవీ రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాయలసీమ నుండి ప్రపంచం చివరి వరకు అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కనుండటంతో ఆసక్తి పెరుగుతోంది.
ఇక అడివి శేష్ లీడ్ రోల్ లో రూపొందుతున్న గూఢచారి 2 షూటింగ్ వేగంగా సాగుతోంది. స్పై థ్రిల్లర్ గా వచ్చిన మొదటి భాగం విజయంతో ఆ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే సమయంలో జాట్ 2 ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉంది. ఆ చిత్రం కూడా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌తో కలిసి మూడు చిత్రాలను నిర్మించేందుకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సిద్ధమవుతోంది. ప్రభాస్ తో మరో సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇవి కాకుండా మరికొన్ని భారీ బడ్జెట్ సినిమాలు ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్నాయని సమాచారం. ఆ ప్రాజెక్టులన్నీ కూడా 2027లో వరుసగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఒక సినిమా పరాజయం వల్ల వెనక్కి తగ్గకుండా మరింత గట్టిగా తిరిగి రావాలని విశ్వప్రసాద్ సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లైనప్ చూస్తే.. విశ్వప్రసాద్ తనపై వచ్చిన విమర్శలకు ఆయన పనులతోనే సమాధానం ఇస్తున్నారని చెప్పాలి.