ఎన్టీఆర్ విష్ చేస్తే ఆయన స్పందించాడు

Update: 2018-05-22 08:23 GMT
కంప్లీట్ యాక్టర్ గా దేశవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు సంపాదించిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. రెండేళ్ల కిందట తెలుగులో ఒకే సమయంలో రెండు సినిమాలు చేసి ఆశ్చర్యపరిచాడు. అంతకుముందు ఎప్పుడో 90ల్లో ‘గాంఢీవం’ అనే సినిమాలో ఒక పాటలో మెరిసి మాయమైన ఆయన.. మళ్లీ తెలుగు సినిమాల వైపు చూడలేదు. ఐతే  ఇన్నేళ్ల విరామం తర్వాత ఒకేసారి ‘మనమంతా’.. ‘జనతా గ్యారేజ్’ లాంటి సినిమాల్లో నటించి ఆశ్చర్యపరిచారు. ఈ రెండు సినిమాల్లోనూ లాల్ అద్భుతంగా నటించాడు. ఆ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఆయన్నెందుకు కంప్లీట్ యాక్టర్ అంటారు ఈ సినిమాలు చూస్తే తెలుగు ప్రేక్షకులకు అర్థమైంది.

కాకపోతే ఇంత బాగా నటించి మెప్పించిన లాల్.. వాటి ప్రమోషన్లకు మాత్రం రాలేదు. అది విమర్శలకు దారి తీసింది. ఆయన కాస్త వీలు చూసుకుని ఈ సినిమాల్ని ప్రమోట్ చేసి ఉంటే వాటికి మేలు జరిగేది. కనీసం ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టడానికి కూడా ఆయనకు తీరిక లేకపోయిందా అన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. వేరే సందర్భాల్లో కూడా ఈ చిత్రాల్లో తనతో కలిసి పని చేసిన వాళ్ల గురించి మోహన్ లాల్ స్పందించింది లేదు. ఇలాంటి తరుణంలో నిన్న లాల్ పుట్టిన రోజు జరిగింది. ఆ సందర్భంగా ఎన్టీఆర్ ఆయన్ని ట్విట్టర్లో విష్ చేశాడు. దానికి లాల్ స్పందిస్తాడని ఎవరూ అనుకోలేదు. ఐతే ఆయన రెస్పాండయ్యాడు. థ్యాంక్స్ చెప్పాడు. దీనిపైనా ఎన్టీఆర్ అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. లాల్ స్పందించడం పట్ల కొందరు సంతోషం వ్యక్తం చేస్తే.. కనీసం తారక్ పేరు కూడా జోడించకుండా.. జస్ట్ థ్యాంక్స్ అనడమేంటి అన్నారు మరికొందరు. ఎన్టీఆర్ పుట్టిన రోజు జరిగిన రెండు రోజులకే లాల్ పుట్టిన రోజు కూడా జరగడం విశేషం.


Tags:    

Similar News