'మెగా' స్టామినా అక్కడ కూడా తక్కువేం కాదు

Update: 2021-08-13 03:06 GMT
మెగా స్టార్‌ చిరంజీవి ఆరు పదుల వయసులో పడి అయిదు సంవత్సరాలు దాటుతున్నా కూడా ఆయన స్టార్ డమ్ విషయంలో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. చిరంజీవి అంటే ఓ బ్రాండ్‌.. చిరంజీవి అంటే ఓ అద్బుతం అన్నట్లుగా ఇప్పటికి మెగా అభిమానులు చిరును నెత్తిన పెట్టుకుని పూజలు చేస్తూనే ఉన్నారు. పదేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి వచ్చినా కూడా ఆయన క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు అంటూ ఖైదీ నెం.150 సినిమా నిరూపితం చేసింది. అద్బుతమైన ఆయన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా భారీగానే ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతున్న ఈ సమయంలో చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ను కూడా పాన్ ఇండియా రేంజ్‌ లో విడుదల చేయబోతున్నారు.

ఆచార్య సినిమాను పాన్‌ ఇండియా మూవీ అన్నట్లుగా తెరకెక్కించలేదు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కు ప్రస్తుతం హిందీలో భారీగా క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు అపజయం లేని కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్‌ చిరంజీవి నటించిన సినిమా అవ్వడం వల్ల హిందీ డబ్బింగ్ రైట్స్ కు భారీగా డిమాండ్ పెరిగింది. ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఆచార్య హిందీ డబ్బింగ్ రైట్స్ కు గాను ప్రముఖ నిర్మాణ సంస్థ పాతిక కోట్లను మించి కోట్‌ చేసిందట. డీల్ దాదాపుగా ముగిసినట్లే అంటున్నారు. ఇప్పటి వరకు ప్రభాస్ సినిమాలు కాకుండా మరే హీరో సినిమా హిందీ రైట్స్‌ కు కూడా ఇంత భారీ మొత్తంలో రాలేదు. మెగా స్టార్‌ స్టామినా ఏంటో ఈ అమౌంట్ చెబుతుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మన మెగాస్టార్‌ కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో ముఖ్యంగా ఉత్తరాదిన కూడా తన స్టామినా చాటాడు అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో ఆచార్య హిందీ డబ్బింగ్‌ రైట్స్ కు సంబంధించిన విషయాలను చర్చించుకుంటూ తెగ హడావుడి చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే తెలుగు లో పవన్‌.. రానాలు చేస్తున్న సినిమా హిందీ డబ్బింగ్‌ రైట్స్ భారీ మొత్తంకు అమ్ముడు పోయినట్లుగా వార్తలు వచ్చాయి. ఇంతలోనే మెగా స్టార్‌ చిరంజీవి కూడా అంతకు మించి అన్నట్లుగా తన ఆచార్య సినిమా తో ఉత్తరాదిన తన స్టామినాను చూపించాడు. అక్కడ కూడా మెగా స్టార్‌ తక్కువ ఏమీ కాదంటూ దీంతో క్లారిటీ వచ్చింది.




Tags:    

Similar News