ఏపీ సీఎంతో టాలీవుడ్ పెద్దల భేటీ ఖరారు..?

Update: 2021-09-01 16:30 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి నుంచి టాలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై చర్చించడానికి ఏపీ సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని టాలీవుడ్ పెద్దలకు సమాచారం అందించారు. జగన్ తో భేటీలో మాట్లాడాల్సిన అంశాలపై ఇప్పటికే ఓ ప్రణాళిక రెడీ చేసుకున్న సినీ ప్రముఖులు.. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 4వ తేదీన జగన్ తో మీటింగ్ ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే టాలీవుడ్ పెద్దలు సీఎంతో భేటీ కావల్సి ఉండగా.. జగన్ తన 25వ పెళ్లి రోజును జరుపుకునేందుకు సిమ్లా టూర్ వెళ్లడంతో ఆలస్యం అయింది. ఇటీవలే తిరిగొచ్చిన జగన్.. వైఎస్పాఆర్ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 2న కడప పర్యటనకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత టాలీవుడ్ పెద్దలను కలవనున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇకపోతే ఏపీ సీఎంతో భేటీలో ఏయే విషయాలపై చర్చించాలని ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఇటీవల చిరంజీవి ఇంట్లో పెద్దలంతా కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఓ జాబితా రెడీ చేసినట్లు తెలుస్తోంది. థియేటర్ల పరిస్థితి - నాలుగో షో కు అనుమతి - 100 శాతం ఆక్యుపెన్సీ - టికెట్ ధరల గురించి ఏపీ ప్రభుత్వంతో చర్చించే అవకాశం ఉంది. చిరంజీవి - నాగార్జున సహా మరికొందరు సినీ ప్రముఖులకి సీఎం జగన్ నుంచి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News