భారతదేశంలో థియేటర్ల కొరత? ప్రభుత్వాల నుంచి చొరవ ఏదీ?
భారతదేశంలో సినిమా అంటే పిచ్చి ఉన్నా, మౌలిక సదుపాయాల కొరత వల్ల మెజారిటీ ప్రజలు (సుమారు 90 శాతం) ఇప్పటికీ థియేటర్ అనుభూతికి దూరంగానే ఉన్నారు.;
భారతదేశంలో సినిమా అంటే పిచ్చి ఉన్నా, మౌలిక సదుపాయాల కొరత వల్ల మెజారిటీ ప్రజలు (సుమారు 90 శాతం) ఇప్పటికీ థియేటర్ అనుభూతికి దూరంగానే ఉన్నారు. అందుకే `ధురంధర్` వంటి సినిమాలు రూ. 1000 కోట్లు వసూలు చేసినా, అది కేవలం 5-8 కోట్ల మంది ప్రేక్షకుల వల్ల వచ్చిన ఆదాయమే అని విశ్లేషకులు చెబుతున్నారు. దాదాపు 150 కోట్ల మంది ప్రజలు ఉన్న భారతదేశంలో 10కోట్ల లోపు ప్రజలు మాత్రమే సినిమాలు చూస్తున్నా 1000 కోట్ల వరకూ కలెక్షన్స్ వస్తున్నాయి. ఒకవేళ 20 కోట్ల మంది ప్రజలను థియేటర్లకు రప్పించగలిగితే, ఆ మేరకు వసూళ్లు కూడా డబుల్ ట్రిపుల్ అయ్యేందుకు ఛాన్సుంది. అంటే భారతదేశం నుంచి 2000 కోట్లు వసూలు చేయగలిగే ఛాన్సుంటుంది.
అయితే దీనికి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అవసరం. అంటే థియేటర్లు పెరగాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పటికే ఎగ్జిబిషన్ రంగం కునారిల్లుతోంది. చాలా సింగిల్ థియేటర్లు కళ్యాణ మంటపాలుగా మారాయి. ఒక రకంగా భారతీయ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఇది ఒకటి. అయితే కొన్ని గణాంకాల ప్రకారం ప్రతియేటా థియేటర్లకు వచ్చేవారి శాతం 2 శాతం నుండి 11 శాతం మధ్య మారుతూ ఉంటుంది.
ఇటీవల ఒక సదస్సులో ఆమీర్ ఖాన్ - షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ, భారతదేశం వంటి భారీ జనాభా కలిగిన దేశంలో మన అతిపెద్ద హిట్లు కూడా కేవలం 2 శాతం నుండి 5 శాతం జనాభా మాత్రమే థియేటర్లలో చూసారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి కారణాలను కూడా ఖాన్ లు విశ్లేషించారు. థియేటర్ల కొరత (స్క్రీన్ డెన్సిటీ తక్కువగా ఉండటం), టికెట్ ధరలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడం ప్రధాన కారణమని అమీర్ ఖాన్ విశ్లేషించాడు.
ఓర్మాక్స్ మీడియా సర్వే ప్రకారం.. భారతదేశంలో కనీసం ఏడాదికి ఒక్కసారైనా థియేటర్‌కు వెళ్లే వారి సంఖ్య సుమారు 15.7 కోట్లు. అంటే మన మొత్తం జనాభాలో ఇది సుమారు 11.1 శాతం మాత్రమే ఇది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ శాతం ఇంకా తక్కువగా (సుమారు 6.5 శాతం) ఉంది.
సౌత్ కంటే 5 శాతం సగటు అనేది ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువగా వర్తిస్తుంది. కానీ మన తెలుగు రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) తమిళనాడులో పరిస్థితి భిన్నంగా ఉంది. దక్షిణ భారతదేశంలో థియేటర్లకు వెళ్లే వారి శాతం సుమారు 22 శాతం వరకు ఉంటుంది. దేశం మొత్తం మీద ఉన్న థియేటర్లలో 50 శాతం పైగా కేవలం ఈ ఐదు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి.
అయితే మన దేశంలో జనం తక్కువగా థియేటర్లకు రావడానికి కారణం.. అమెరికాలో ప్రతి 10 లక్షల మందికి 120 స్క్రీన్లు ఉంటే, ఇండియాలో కేవలం 7 నుండి 8 స్క్రీన్లు మాత్రమే ఉన్నాయి. మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలు, పాప్‌కార్న్ ధరలు సామాన్యుడి బడ్జెట్‌ను దాటిపోతున్నాయి. OTT ప్రభావం కూడా ఒక కారణం. సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే OTTలో వస్తుందనే భరోసాతో చాలా మంది థియేటర్లకు రావడం తగ్గించేశారు. మన పరిశ్రమలు హాలీవుడ్ కి ధీటుగా సినిమాలు తీస్తూ గ్లోబల్ మార్కెట్లో ఎదుగుతున్నాయి. ఈ సమయంలో భారతదేశంలో థియేటర్ల సంఖ్య పెరగడానికి ప్రభుత్వం లేదా పరిశ్రమ తగినన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.