సూపర్ స్టార్...మార్చాలి గేర్

Update: 2021-12-17 23:30 GMT
మహేష్ బాబు సూపర్ స్టార్. తండ్రి బిరుదునే కాదు, ఆయన నటనా వారసత్వాన్ని  కంటిన్యూ చేస్తూ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. మహేష్ బాబుది దాదాపుగా పాతికేళ్లకు చేరువ అవుతున్న కెరీర్. ఆయన తరువాతనే అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీయార్, ప్రభాస్, రామ్ చరణ్ వచ్చారు. అయితే ఇపుడు వీరంతా పాన్ ఇండియా స్టార్లు అయిపోయారు. ఒక్క లెక్కన జోరు చేస్తున్నారు. కేవలం తెలుగింట మాత్రమే కాదు, పొరుగింట జే గంట మోగిస్తున్నారు. కెరీర్ లో పీక్స్ ని చూస్తున్నారు.

మహేష్ బాబు కూడా ఎన్నో మంచి సినిమాలు చేశారు. బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చారు. అయితే ఆయన కూడా పరిధి దాటి ఇండియన్ స్క్రీన్ ని టచ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మహేష్ బాబు లో ఆ టాలెంట్ ఉంది. ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా దానికి హెల్ప్ అవుతుంది అన్న సినీ మేధావుల విశ్లేషణలు ఉన్నాయి. మహేష్ బాబు హీరో అయిన కొత్తలో దర్శకేంద్రుడు రాఘేవేంద్రరావు ఆయన చార్మింగ్ ఫేస్ ని చూసి టాలీవుడ్ కి  కాదు హాలీవుడ్ కే సూపర్ డూపర్  హీరో దొరికాడు అని కితాబు ఇచ్చారు.

మహేష్ బాబు మొదటి నుంచి అండర్ ప్లే యాక్టింగ్ ని ఎక్కువగా చేస్తారు. ఆయన పక్కా మాస్ హీరోగా  ముద్రపడకపోవడానికి అదొక కారణంగా  చెప్పుకోవచ్చు. ఊరికే అరుపులు కేకలు పెట్టడమే నటన కాదని భావాన్ని అంతర్లీనంగా పలికిస్తూ ఫేస్ లో వేయి ఎక్స్ ప్రెషన్స్ ని చూపించడమే మేలిమి నటన అని ఆది నుంచే అలవాటు చేసుకుని అనుసరిస్తూ వస్తున్న వారు సూపర్ స్టార్.

మహేష్ బాబు బాలీవుడ్ లో అడుగుపెట్టాలంటే అది చిటికలో పనే. ఆయన శ్రీమతి బాలీవుడ్ కి చెందిన వారే. ఇక బాలీవుడ్ లో మంచి రిలేషన్స్ ఆయన సొంత బ్యానర్ పద్మాలయా సంస్థ కాలం నుంచి ఉన్నాయి. అయితే మహేష్ బాబు మాత్రం తెలుగునే ప్రేమిస్తూ ఇక్కడే సినిమాలు చేస్తూ వస్తున్నారు.

సెట్స్ మీద ఉన్న సినిమా సర్కార్ వారి పాట కూడా పక్కా కమర్షియల్ మూవీ. అయితే మహేష్ స్టామినాకు కొలమానంగా ఈ తరహా సినిమాలు ఉండవు అని అంటున్నారు. ఆయన సైతం పాన్ ఇండియా మూవీ చేయాలని అంతా కోరుకుంటున్నారు. మహేష్ బాబు మరి వారి కోరిక ఆలకించారన్నట్లుగా రాజమౌళి తో మూవీ కమిట్ అయ్యారు.  సర్కార్ వారి పాట తరువాత చేసేది అదే అయి ఉండవచ్చు.

ఈ మూవీ తరువాత మహేష్ బాబు సైతం బాలీవుడ్ లో జెండా పాతేస్తాడు అన్న వారే ఎక్కువగా ఉన్నారు. ఇక సినిమా సినిమాకు గ్యాప్ తీసుకోకుండా వరసబెట్టి మహేష్ కమిట్ అవాలని కూడా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అదే విధంగా మాస్ ఓరియెంటెడ్ సబ్జెక్టులను మహేష్ బాబు ఎంచుకుంటే విరగదీయడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి సూపర్ స్టార్ రేసులో దూసుకువచ్చేది రాజమౌళి మూవీతోనే అంటున్నారు. సో ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా వెయిటింగ్.
Tags:    

Similar News