ఎంత దాచేస్తున్నా బాలయ్యే గుర్తొస్తున్నాడుగా?
ఇప్పడు ఇదే భయం కారణంగా `జన నాయగన్` మేకర్స్ తమ సినిమా ఒరిజినల్ అని చెప్పుకుంటున్నారా? అన్నది ఆసక్తికరంగా మారింది.;
రీమేక్..కోవిడ్ తరువాత ఈ పేరు వింటేనే హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ భయపడుతున్నారు. కోవిడ్ కారణంగా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు అందుబాటులోకి వచ్చేశాయి. వాటి వల్ల ఇతర భాషల సినిమాలు కూడా తెలుగులోకి అనువాదం అవుతున్నాయి. దీంతో ప్రేక్షకులే కాకుండా హీరోలు, మేకర్స్ రీమేక్‌ల జోలికి వెళ్లడం లేదు. కారణం అప్పటికే ఆయా సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేసి ప్రేక్షకులు చూసేస్తుండటమే. ఒక వేళ కొన్ని సినిమాలు తెలుగులో డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కాకపోయినా వాటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా ద్వారా తెలియడంతో ప్రేక్షకులు రీమేక్‌లపై ఆసక్తి చూపించడం లేదు.
దీనికి నిదర్శనమే తెలుగులో సూపర్ హిట్‌లుగా నిలిచి హిందీలో రీమేక్ అయిన హిట్, అల వైకుంఠపురములో`, మలయాళ హిట్ అయి తెలుగులో రీమేక్ అయిన `గాడ్ ఫాదర్` చిత్రాలు. దీంతో మేకర్స్ ఈ రోజుల్లో రీమేక్‌లు చేసే సాహసం చేయడం లేదు. ప్రేక్షకులలో రీమేక్‌లపై ఆసక్తి తగ్గిపోవడంతో మేకర్స్ కూడా వాటి గురించి చెప్పుకోవడానికి ఇష్టపడటం లేదు. కారణం ఓపెనింగ్స్‌పై ప్రభావం పడుతుందనే భయం వారిని వెంటాడటమే. ఇప్పడు ఇదే భయం కారణంగా `జన నాయగన్` మేకర్స్ తమ సినిమా ఒరిజినల్ అని చెప్పుకుంటున్నారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి సినిమా `జన నాయగన్`. హెచ్. వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని తెలుగులో `జన నాయకుడు` పేరుతో భారీ స్థాయిలో రిలీజ్‌చేస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, `ప్రేమలు` ఫేమ్ మమితా బైజు కీలక పాత్రలో నటిస్తోంది. బిజినెస్ పరంగా ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తున్న ఈ మూవీ జనవరి 9న రిలీజ్ కాబోతోంది. సినిమా ప్రారంభం నుంచే ఇది నందమూరి బాలకృష్ణ నటించి తెలుగు సూపర్ హిట్ ఫిల్మ్ `భగవంత్ కేసరి` రీమేక్ అనే ప్రచారం జోరందుకుంది.
`జన నాయగన్` మూవీని `భగవంత్ కేసరి` పాయింట్ ఆధారంగానే తెరకెక్కించారు. కానీ ఆ విషయాన్ని మాత్రం మేకర్స్, డైరెక్టర్ హెచ్ వినోద్ మాత్రం అంగీకరించడం లేదు. ఇది తెలుగు సినిమా రీమేక్ కాదని గానీ, అవునని గానీ తాను చెప్పలేనని, అయితే ఇది దళపతి విజయ్ సినిమా అని మాత్రం చెప్పగలనని స్మార్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. `భగవంత్ కేసరి` దర్శకుడు అనిల్ రావిపూడిని అడిగినా ఇది విజయ్ సినిమా అని, తన పాయింట్‌తో సినిమా చేశారా? లేదా అన్నది సినిమా రిలీజ్ తరువాతే అర్థమవుతుందని చెబుతున్నాడు.
అంటే ఇద్దరి మాటలని బట్టి చూస్తే విజయ్ `జన నాయకుడు` పక్కా `భగవంత్ కేసరి` రీమేక్ అని స్పష్టమవుతోంది. అయితే అదే కథని భారీ స్కేల్‌లో మరింత ప్రభావ వంతంగా విజయ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మలిచి ఉంటారనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ప్రోమోలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడంతో విజయ్ `జన నాయకుడు`పై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ టాక్ సినిమా ఓపెనింగ్స్‌పై ప్రభావాన్ని చూపిస్తుందా? లేక విజయ్ క్రేజ్ ముందు తేలిపోతుందా? అన్నది జనవరి 9 వరకు వేచి చూడాల్సిందే.