అనిల్ కు దిమ్మ తిరిగేలా చేసిన నయన్
అనిల్ ను చూసి ఎంతో మంది అతని దారిలోనే ప్రయత్నించి తమ సినిమాలను ప్రమోట్ చేసే ప్రయత్నాలు కూడా చేశారు.;
సినిమాల్ని ప్రమోట్ చేయడం డైరెక్టర్ అనిల్ రావిపూడి రూటే సపరేట్. సినిమాల సక్సెస్ విషయంలోనే కాకుండా వాటిని ప్రమోట్ చేసే విధానంలో కూడా రాజమౌళి తర్వాత అనిలే కనిపిస్తారు. తన సినిమాలను ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానికి అనిల్ చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఒక విధంగా చెప్పాలంటే టాలీవుడ్ లో పబ్లిసీటీ ట్రెండ్ ను కూడా అనిల్ మార్చారనే చెప్పాలి.
అనిల్ ను చూసి ఎంతో మంది అతని దారిలోనే ప్రయత్నించి తమ సినిమాలను ప్రమోట్ చేసే ప్రయత్నాలు కూడా చేశారు. అలాంటి అనిల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మన శంకరవరప్రసాద్ గారు అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవనున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
నయనతారను రంగంలోకి దించిన అనిల్ అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అనిల్ మరింత కొత్తగా ట్రై చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ అంటే దూరంగా ఉండే నయనతారతో ఓ వీడియో చేయించి సినిమాను మొదలుపెట్టిన అనిల్, ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ కు కూడా ఆమెను రంగంలోకి దించారు. తాజాగా ఈ సినిమా నుంచి న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ ఓ వీడియోను రిలీజ్ చేశారు.
ఈ వీడియోలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ నయనతారే అనిల్ ను ప్రమోషన్స్ చేస్తానని అడగడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఏంటి అనిల్ అప్పుడెప్పుడో మూవీ స్టార్టింగ్ లో ఓ ప్రమోషనల్ వీడియో చేశావు, ఇప్పుడు సినిమా అయిపోయింది మరేమీ లేవా అని నయనతార అనిల్ ను అడగ్గాను, ఆ మాటకు అతను కళ్లు తిరిగి పడిపోయినట్టు యాక్ట్ చేసి, అసలు మీ అంతట మీరు ప్రమోషన్ అని అడగటమే పెద్ద ప్రమోషన్ అని, మీరు సినిమా జనవరి 12న రిలీజ్ అని అనౌన్స్ చేస్తే చాలని చెప్పడంతో అనిల్ చెప్పినట్టే చెప్పిన నయన్, తర్వాత హలో మాస్టారూ కెమెరా కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకోండమ్మా అని చెప్పడం, పక్కన అనిల్ రావడం, ఇద్దరూ కలిసి సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం అనడం అంతా బావుంది. ఈ వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తుండగా, ఇకపై సినిమా నుంచి రోజుకో అప్డేట్ ఉంటుందని మేకర్స్ ఈ సందర్భంగా అనౌన్స్ చేశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.