బాలీవుడ్‌పై విజయ్ డైరెక్టర్ ఫైర్!
దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి సినిమా `జన నాయగన్`. వరుస బ్లాక్ బస్టర్ హిట్‌లని అందించి దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్న హెచ్. వినోద్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.;
దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి సినిమా `జన నాయగన్`. వరుస బ్లాక్ బస్టర్ హిట్‌లని అందించి దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్న హెచ్. వినోద్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా హిట్ మెషీన్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి తెరకెక్కించిన `భగవంత్ కేసరి` ఆధారంగా దీన్ని తెరకెక్కించారనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. దర్శకుడు మాత్రం అది నిజమని చెప్పలేనని, అలాగని కాదని తెలపలేనని చెబుతూనే ఇది దళపతి విజయ్ సినిమా అంటున్నాడు.
బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో `ప్రేమలు`, డ్రాగన్ ఫేమ్ మమిత బైజు నటిస్తోంది. ఇతర కీలక పాత్రల్లో గౌతమ్ మీనన్, ప్రియమణి, ప్రకాష్‌రాజ్, నరేన్ నటిస్తున్నారు. అయితే ఇందులో కథకు కీలకంగా నిలిచే ప్రధాన విలన్ క్యారెక్టర్‌లో బాలీవుడ్ స్టార్ బాబి డియోల్ నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించిన టీమ్ ఈ మూవీని జనవరి 9న తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతోంది. ఇటీవల మలేసియాలోని కౌలాలంపూర్‌లో భారీ ఎత్తున ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌ని హోరెత్తిస్తున్న దర్శకుడు తాజాగా బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. `జన నాయగన్` మూవీలో పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తున్న బాబీ డియోల్‌ని బాలీవుడ్ సరిగా ఉపయోగించుకోలేదని ఫైర్ అయ్యాడు. అతన్ని హిందీ ఇండస్ట్రీ అతన్ని ఎలా వదిలేసిందో ఇప్పటికీ అర్తం కావడం లేదన్నాడు. ఆర్టిస్ట్‌గా అతని ప్రొటెన్షియాలిటీని సరిగా వాడుకోలేదని విమర్శలు గుప్పించాడు.
హిందీ సినిమా బాబీ డియోల్‌ను ఇంత కాలం ఎందుకు విస్మరించిందో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే అతను స్వస్ఛమైన యాక్షన్ హీరోకు సరిపోయే వ్యక్తి. కొన్ని పాత్రలు రాసేటప్పుడు అవి తెరపై ఎలా కనిపిస్తాయా అని మేము తరచుగా ఆలోచిస్తుంటాం. `జన నాయగన్`లోని పాత్ర కోసం నేను ఊహించిన దానికంటే తను చాలా అద్భుతంగా నటించాడు. స్వతహాగా బాబి డియోల్ నిజ జీవితంలో చాలా సైలెంట్‌గా ఉండే వ్యక్తి. కానీ ఒక్కసారి యాక్షన్ అనగానే తెరపై అద్భుతంగా నటించి తనదైన ముద్ర వేస్తాడు` అన్నారు.
అంతే కాకుండా హిందీలో తనకు సినిమా తీసే అవకాశం వస్తే మాత్రం కచ్చితంగా బాబిడియోల్ హీరోగా ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని చేయాలనుకుంటున్నానని, తనతో కలిసి పని చేయడం నాకు చాలా బాగా నచ్చిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి బాబి డియోల్ దర్శకుడి కోరిక మేరకు హిందీ ప్రాజెక్ట్ చేస్తాడా? లేదా అన్నది వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే `జన నాయగన్` విజయ్ చివరి సినిమా కావడంతో బిజినెస్ పరంగానూ ఈ మూవీ సంచలనాలు సృష్టిస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే రూ.325 కోట్లు దాటినట్టుగా కోలీవుడ్ వర్గాల కథనం.