మధురగీతాల మణిహారం .. కీరవాణి (బర్త్ డే స్పెషల్)

Update: 2021-07-04 03:30 GMT
పాట మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుంది .. ఉత్సాహాన్ని ఇస్తుంది .. ఓదార్పునిస్తుంది .. ఒంటరితనం లేకుండా చేస్తుంది. ఆవేదనతో నిండిన మనసుకు మంచి పాటకు మించిన మందులేదు. సినిమా చూస్తున్నప్పుడు మాత్రమే కథ .. మాటలు గుర్తుంటాయి. థియేటర్ బయటికి వెళ్లాక కూడా తోడుగా వచ్చేది పాటనే. అప్పుడప్పుడు .. అక్కడక్కడా వినిపించేది పాటనే. మధురమైన పాట పరిమళాలు వెదజల్లుతూనే ఉంటుంది .. పరవశింపజేస్తూనే ఉంటుంది. అలాంటి పాటలను అందించిన సంగీత దర్శకులలో కీరవాణి ఒకరు.

కీరవాణి పూర్తి పేరు కోడూరి మరకతమణి కీరవాణి. మొదటి నుంచి కూడా కీరవాణికి సంగీతం అంటే ఇష్టం .. పాటంటే ప్రాణం. అందువల్లనే సినిమా సంగీతం దిశగానే ఆయన అడుగులు పడ్డాయి. 'మనసు మమత' సినిమాతో సంగీత దర్శకుడిగా ఆయన ప్రయాణం మొదలైంది. ఆ సినిమా నుంచి ఇక ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. కథలో సందర్భాన్ని బట్టి .. పాత్రల స్వభావాన్ని బట్టి బాణీ కట్టడం ఆయన ప్రత్యేకత. సాహిత్యాన్ని అధిగమించని సంగీతంతో పాటకు ఒక సున్నితత్వాన్నీ .. సౌందర్యాన్ని తీసుకొచ్చేవారాయన.
Read more!

ఒక వైపున హుషారైన పాటలను కంపోజ్ చేస్తూనే, మరో వైపున మెలోడీ గీతాలకు ఆయన కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయారు. అంతేకాదు భక్తిగీతాలను అందంగా .. అతి మధురంగా ఆవిష్కరించడంలోను ఆయన తనదైన ప్రత్యేకతను కనబరిచారు. అందుకు నిదర్శనంగా 'సీతారామయ్యగారి మనవరాలు' .. 'క్షణక్షణం' .. ''అల్లరి ప్రియుడు' .. 'పెళ్లి సందడి' .. 'శుభ సంకల్పం' .. 'మాతృదేవోభవ' .. 'శ్రీరామదాసు' .. 'అన్నమయ్య' వంటి సినిమాలు కనిపిస్తాయి. ఆ సినిమాల్లోని పాటలు తేనెకన్నా తీయగా .. వెన్నెలకన్నా చల్లగా అనిపిస్తాయి.

పూసింది పూసింది పున్నాగ .. (సీతారామయ్య గారి మనవరాలు).. జామురాతిరి .. (క్షణక్షణం) నువ్వే నా శ్వాస .. (ఒకరికి ఒకరు) సొగసు చూడతరమా .. (మిస్టర్ పెళ్లాం) ఇలా ఎన్నో పాటలు మధురమైన మంత్రాల్లా మనసు గదిలో మ్రోగుతూనే ఉంటాయి. 'మాతృదేవోభవ' సినిమాలోని 'రాలిపోయే పువ్వా నీకు ..' పాట ఒక్కటి చాలు, కీరవాణి సంగీతపు లోతులు తెలియడానికి .. ఆయన ప్రతిభాపాటవాల ఎత్తులు కొలవడానికి. ఈ పాట ఆయన ఎంత గొప్ప సంగీత దర్శకుడు అనే విషయంతో పాటు, ఎంతమంచి గాయకుడో కూడా చాటుతుంది. ఈ రోజున ఆయన పుట్టినరోజు .. ఈ సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తూ .. ఆయన నుంచి మరిన్ని మధుర గీతాలు రావాలని కోరుకుందాం.    
Tags:    

Similar News