విద్యార్థుల కోసం తన టెన్త్ మార్కులు బయటపెట్టిన స్టార్ హీరో!!

Update: 2020-07-16 15:30 GMT
నిజంగా జీవితంలో చదువుకునే సమయంలో రాసే పరీక్షలు జీవితంలో గెలుపు ఓటములను డిసైడ్ చేయలేవు. హార్డ్ వర్క్, కృషి, పట్టుదల, ఆత్మ విశ్వాసం.. లాంటివి మనలను ముందుకు నడుపుతాయి. పరీక్ష అనేది కేవలం మీ తెలివికి సంబంధించినది మాత్రమే. మీ జీవితంలో పరీక్ష అనేది మార్కుల వరకే అంకితం. మిగతా లైఫ్ అంతా మనమే నెట్టుకురావాలి.. నువ్ సాధించిన మార్కులు నీ జీవితంలో ఎలాంటి ఉపయోగం కలిగించలేవు. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన మాటలు సామాన్యులు చెబితే ఎవరు వినరు. అదే సొసైటీలో కాస్త నేమ్ ఫేమ్ ఉన్నవాళ్లు చెబితే మాత్రం చెవులు అప్పగించి మరీ వింటారు.

అంటే వాళ్లకు నచ్చిన గురువు కావచ్చు.. రాజకీయ నాయకుడు కావచ్చు.. ఆఖరికి ఓ సినీ సెలబ్రిటీ కూడా అయ్యుండొచ్చు. తాజాగా అలాంటి స్ఫూర్తి పొందే మాటలు ఓ సినీ హీరో నుండి వినిపించాయి. నేరుగా కాదు ఆయన ట్విట్టర్ పోస్ట్ ద్వారా. ఆ సినీ హీరో ఎవరో కాదు. టాలీవుడ్ టు బాలీవుడ్ సుపరిచితుడైన ఆర్. మాధవన్. తాజాగా సీబీఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ సందర్భంగా హీరో మాధవన్.. ఆయన బోర్డు ఎగ్జామ్స్ లో పొందిన మార్కులను బయటపెట్టి ధైర్యాన్ని ఇచ్చారు. ట్విట్టర్ ద్వారా.. "ఈ ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని ఎవరూ నిరాశ చెందవద్దు. నాకు టెన్త్‌లో 58 శాతం మార్కులు మాత్రమే వచ్చాయి.

తక్కువ మార్కులు వచ్చాయని స్టూడెంట్స్ ఎవరూ ఆందోళనకు గురికాకండి. ఎందుకంటే ఆట ఇప్పుడే మొదలు కాలేదు. మిత్రులారా.." అంటూ మాధవన్ ట్వీట్ చేశారు. ప్రస్తుత పరిస్థితులలో ఇలాంటి మాటలు విద్యార్థులకు ఎంతో అవసరంగా అందరూ భావిస్తున్నారు. 58% మార్కులు పొందిన మాధవన్ నిరాశ చెందకుండా తను అనుకున్నది సాధించాడు. నటుడిగా స్టార్డం చవిచూశాడు. ఇక్కడ ఆయన మార్కులేవి కెరీర్లో ఉపయోగ పడలేదు. కేవలం ఆయన ఆత్మవిశ్వాసం, పట్టుదల, హార్డ్ వర్క్ మాత్రమే జీవితంలో గెలిపిస్తాయని నెట్టింట మ్యాడికి మద్దతు పలుకుతున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
Tags:    

Similar News