మహేశ్ ను లైన్లో పెట్టేస్తున్న 'మాస్టర్' డైరెక్టర్?

Update: 2021-03-13 09:30 GMT
ఈ మధ్య కాలంలో తమిళంలో భారీ వసూళ్లను సాధించిన చిత్రంగా 'మాస్టర్' కనిపిస్తుంది. విజయ్ పేరుతో అంతకుముందున్న రికార్డులనే ఈ సినిమా చెరిపేసింది. సందీప్ కిషన్ 'నగరం' .. కార్తీ 'ఖైదీ' సినిమాలతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న లోకేశ్ కనగరాజ్, ఆ సినిమాల ట్రీట్మెంట్ తో విజయ్ ను పడేశాడు. ఇంటికి పిలిచి అవకాశం ఇచ్చేలా చేశాడు. అంతేకాదు లోకేశ్ కనగరాజ్ స్క్రీన్ ప్లే ప్రతిభకు మెచ్చిన కమల్, తన బ్యానర్ పై ఒక ఛాన్స్ ఇచ్చాడు. 'విక్రమ్' టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది.

కమల్ అంటేనే కొత్తదనానికి కేరాఫ్ అడ్రెస్ .. అలాంటి కమల్ ను తన కథతో లోకేశ్ వెంటనే మెప్పించాడంటే మాటలు కాదు. అంతేకాదు .. ఖర్చు విషయంలో వెనకాడవద్దని కమల్ భరోసా ఇచ్చాడంటే లోకేశ్ పై ఆయనకి గల నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాంటి లోకేశ్ .. కమల్ తరువాత సినిమాను ఏ హీరోతో చేయనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. అయితే లోకేశ్ తన డిమాండ్ కి తగినట్టుగానే స్టార్ హీరోల వైపు తన కథలను మళ్లిస్తున్నాడు. తమిళంలో రజనీకాంత్ కోసం ఒక కథను రెడీ చేసుకుంటున్న ఆయన, తెలుగులో మహేశ్ బాబు కోసం మరో కథను సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు.
Read more!

'మాస్టర్' సినిమాతో హీరో విజయ్ తో లోకేశ్ కి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అందువల్లనే లోకేశ్ ఆయనతో మహేశ్ బాబుకి కాల్ చేయించాడనే ఒక టాక్ వినిపిస్తోంది. హీరో విజయ్ కి .. మహేశ్ బాబుకి మధ్య మంచి స్నేహం ఉంది. ఒకరి సినిమా చూసి ఒకరు తరచూ ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటారు. అందువలన లోకేశ్ సిద్ధం చేస్తున్న కథను వినమని  మహేశ్ బాబుతో విజయ్ చెప్పాడనే వార్త చక్కర్లు కొడుతోంది. అపాయింట్ మెంట్ ఇవ్వడానికి మహేశ్ బాబు అంగీకరించాడని అంటున్నారు. గతంలో మురుగదాస్ కి ఛాన్స్ ఇచ్చిన మహేశ్ బాబు, ఈ సారి లోకేశ్ కి అవకాశం ఇస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమయం పడుతుందేమోగానీ, కాంబినేషన్ సెట్ కావడం మాత్రం ఖాయమేనని చెప్పుకుంటున్నారు. ఇది గాసిప్ గానే ఉండిపోతుందా? దానిని దాటుకుని నిజమవుతుందా? అనేది చూడాలి.   
Tags:    

Similar News