లేటెస్ట్ క్లిక్: మహేష్ తో సుకుమార్ ముచ్చట్లు..!

Update: 2021-08-12 13:30 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ సుకుమార్ కాంబోలో '1-నేనొక్కడినే' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే హాలీవుడ్ స్థాయిలో మహేష్ - సుకుమార్ చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. దీంతో వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలని నిర్ణయించుకొని.. ఓ ప్రాజెక్ట్ కి అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. మరికొన్ని రోజుల్లో సెట్స్ మీదకు వెళ్తుందనగా.. ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఈ సినిమా క్యాన్సిల్ అయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో సుక్కూ చేస్తున్న 'పుష్ప' సినిమా మహేష్ తో చేయాల్సిందే అని టాక్ ఉంది. ఏదైతేనేం ఈ ఇష్యూ తర్వాత మహేష్ - సుక్కూ కాంబోలో మరో సినిమా రావడం కష్టమే అని అందరూ అనుకున్నారు.

అయితే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవడం వల్ల మహేష్ బాబు - సుకుమార్ మధ్య ఎలాంటి మనస్పర్థలు విభేదాలు రాలేదని తెలుస్తోంది. ఇప్పటికీ ఇద్దరూ ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటున్నారు. తాజాగా మహేష్ - సుక్కూ కలిసి సెట్స్ లో ముచ్చటిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ ఓ కమర్షియల్ యాడ్ కోసం వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌ లో ఈ యాడ్ షూటింగ్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా మహేష్ - సుకుమార్ ఇద్దరూ ఒకరితో ఒకరు చాలా సేపు మాట్లాడుకున్నారని తెలుస్తోంది. 'సర్కారు వారి పాట' టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ కు సుకుమార్ అభినందనలు కూడా తెలిపారట.

వాస్తవానికి ఇంతకముందు కూడా హీరో - దర్శకులు ఒకరిపై ఒకరు అభిమానాన్ని చాటుకున్నారు. సుకుమార్ ప్రొడ్యూస్ చేసిన 'ఉప్పెన' సాంగ్ ను మహేష్ లాంచ్ చేశారు. అలానే సుకుమార్ ఇంట్లో జరిగిన ఫంక్షన్ కు ఫ్యామిలీతో కలిసి హాజరయ్యారు సూపర్ స్టార్. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి ఇద్దరూ కమర్షియల్ యాడ్ కోసం కలిశారు. ప్రస్తుతం మహేష్ బాబు - సుకుమార్ కలిసి ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో మైత్రీ ప్రొడ్యూసర్ మరియు 'పుష్ప' సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్ కూడా ఉన్నారు. దీంతో 'పుష్ప' సెట్ లోనే మహేష్ - సుక్కూ కలిసారని అభిమానులు భావిస్తున్నారు. ఏదేమైనా వీరి కాంబోలో మరో సినిమా చేస్తే చూడాలని కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News