డైరెక్టర్ ఒప్పుకున్నా మహేష్ ఒప్పుకోడే..

Update: 2015-07-29 12:16 GMT
టాలీవుడ్ కు దొరికిన ఆణిముత్యం లాంటి నటుడు మహేష్ బాబు. ఈ విషయం ఏ ఇండస్ట్రీ జనాలు ఒప్పుకుంటారు. ప్రేక్షకులూ ఒప్పుకుంటారు. నటన విషయంలో పర్ఫెక్షన్ కోసం అతనెంతగా తపిస్తాడో తనతో పని చేసిన చాలామంది డైరెక్టర్లు చెప్పారు. ఆ తపన చూసే మహేష్ తో మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుందని.. అతడి మాయలో చిక్కుకుపోతామని గుణశేఖర్ లాంటి డైరెక్టర్లు చెబుతుంటారు. డైరెక్టర్ గా తన రెండో సినిమాతోనే మహేష్ తో పని చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన కొరటాల శివ కూడా అందరు డైరెక్టర్ల లాగే మహేష్ మాయలో పడిపోయినట్లే  ఉన్నాడు. శ్రీమంతుడు సినిమా విషయంలో సూపర్ స్టార్ కమిట్మెంట్ చూసి మెస్మరైజ్ అయిపోయానంటున్నాడు.

‘‘భారత దేశంలోని అత్యుత్తమ నటుల్లో మహేష్ ఒకడన్నది నా అభిప్రాయం. పాత్ర కోసం ఏమైనా చేస్తారు. అదే సమయంలో పాత్రను దాటి ఆయనేదీ చేయరు. శ్రీమంతుడు విషయానికొస్తే ఓ సన్నివేశం పూర్తయిన వెంటనే నేను మానిటర్ లో చూసుకుంటా. ఓసారి దర్శకుడిగా, మరోసారి రచయితగా తరచి చూసుకుంటే నాకంతా బాగానే అనిపిస్తుంది. కానీ అదే సన్నివేశం చూసి మహేష్.. ‘ఇక్కడేదో తేడా కొడుతోంది. మరోసారి చేద్దామా’ అని అడుగుతాడు. అంటే నాకు కనిపించని సూక్ష్మమైన లోపాలు కూడా ఆయనకు కనిపిస్తాయన్నమాట. కానీ ఇక్కడ ఈ డైలాగ్ ని మరోలా చెబుదాం.. విజిల్స్ ఎక్కువ పడతాయి.. అన్నా ఆయన చేయరు. కథని, పాత్రని  దాటి ఒక్క ఇంచి కూడా ముందుకు వేయరు. అదీ మహేష్ అంటే’’ అంటూ తన హీరోను ప్రశంసల్లో ముంచెత్తాడు కొరటాల.
Tags:    

Similar News