ఆ ఇద్ద‌రితో కొర‌టాల పాన్ ఇండియాలేనా?

Update: 2022-02-08 01:30 GMT
రెబ‌ల్ స్టార్ ప్రభాస్.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ .. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ల‌తో సినిమాలు చేశాడు కొర‌టాల‌. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల‌ను క‌లిపి ఆచార్య లాంటి మెగా మల్టీస్టార‌ర్ ని తెర‌కెక్కించారు. ఈ సినిమా త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. త‌దుప‌రి ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. ఆ త‌ర్వాత ఇంకెవ‌రితో?  చ‌ర‌ణ్.. ప‌వ‌న్ .. దేవ‌ర‌కొండ ఇలా హీరోలెంద‌రో ఉన్నా ఈసారి అవ‌కాశం ఎవ‌రికి? అంటే.. మ‌రోసారి రామ్ చ‌ర‌ణ్ తో భారీ ప్రాజెక్టు చేయ‌నున్నాడ‌ని తెలిసింది.

నిజానికి మిర్చి త‌ర్వాతే చ‌ర‌ణ్ తో సినిమా చేయాల‌ని రామానాయుడు స్టూడియోస్ లో ఓపెనింగ్ కూడా చేశారు. కానీ ఎందుక‌నో ఆ ప్రాజెక్ట్ పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం క్యాన్సిల్ అయ్యింది. త‌ర్వాత చ‌ర‌ణ్ ఇత‌ర ద‌ర్శ‌కుల‌తో బిజీ అయిపోగా.. కొర‌టాల త‌న మార్గంలో తాను సినిమాలు చేస్తూ బ్లాక్ బ‌స్ట‌ర్లు కొడుతున్నారు. ఇప్పుడు కూడా చెర్రీకి తాను ర‌చ‌యిత‌గా ఉన్న‌పుడు వినిపించిన క‌థ‌నే మ‌ళ్లీ వినిపించి ఫైన‌ల్ చేసాడ‌ట‌. కొర‌టాల‌-చ‌ర‌ణ్ సినిమా ఖాయ‌మైంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఎట్ట‌కేల‌కు స్నేహితులు.. ఆర్.ఆర్.ఆర్ స్టార్లు తార‌క్ - చ‌ర‌ణ్ ఇద్ద‌రితో వెంట వెంట‌నే సినిమాలు ప్లాన్ చేశారు కొర‌టాల‌. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ త‌ర్వాత ఆ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్లుగా హిందీ మార్కెట్లోనూ స‌త్తా చాటే రేంజుకు ఎదిగేస్తారు. చెర్రీ శంకర్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. వీటన్నిట‌కీ త‌గ్గ‌ట్టే ఇప్పుడు కొర‌టాల కూడా ఆ ఇద్ద‌రితోనూ వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమానే తీయాల్సి ఉంటుందేమో!
Tags:    

Similar News