మహిళల ఇంటికి వెళ్లి కోయిలమ్మ నటుడు ‘రచ్చ’లో అసలు సంగతులేమిటి?

Update: 2021-01-28 12:30 GMT
ఈ రోజు ఉదయం పది గంటల సమయం నుంచి వాట్సాప్ గ్రూపుల్లోనూ.. వెబ్ సైట్ లోనూ.. టీవీ చానళ్లలో ఒకటే హడావుడి నెలకొంది. మద్యం మత్తులో బుల్లితెర నటుడు.. కోయిలమ్మ హీరో సమీర్ అలియాస్ అమర్ వీరంగం వేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే.. చాలామంది నిజాల సంగతేమిటి? అన్నది పక్కన పెట్టి.. వీరంగం వేసినట్లుగా తీర్పులు ఇచ్చేస్తూ పోస్టులు పెట్టేశారు. తాగిన మైకంలో ఇద్దరు మహిళలపై దౌర్జన్యానికి దిగారని.. రాత్రి 9 గంటలకు మహిళల ఇంటికి వెళ్లి మరీ వేధింపులకు గురి చేసినట్లుగా.. అసభ్య పదజాలంతో మహిళల్ని సమీర్ దూషించినట్లుగా వార్తలు వచ్చాయి. నిజంగానే సమీర్ అలా చేశాడా? ఒకవేళ అదే నిజమైతే.. అతడి పక్కనున్న మహిళ ఎవరు? ఆ అమ్మాయి ఎందుకంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.

తొలుత వచ్చిన సమాచారానికి.. తర్వాత వస్తున్న సమాచారానికి పొంతన లేకుండా వస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. ఇరుపక్షాల వాదనలు విని.. ఎలాంటి ముందస్తు తీర్పులు ఇవ్వకుండా.. ఇష్యూను ఇష్యూలా చూసినప్పుడు ఏం జరిగిందన్నది చూస్తే..

శ్రీవిద్య..స్వాతి.. లక్ష్మీలు స్నేహితులు. ఈ ముగ్గురు కలిసి మణికొండలో బోటిక్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. కొన్ని కారణాలతో ఈ భాగస్వామ్య వ్యాపారం నుంచి స్వాతి తప్పుకుంది. ఆమెకు రావాల్సిన కొన్ని వస్తువులను తిరిగి ఇవ్వలేదన్న వాదనను వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వాతి.. కోయిలమ్మ నటుడు సమీర్తో కలిసి స్వాతి.. శ్రీవిద్య ఇంటికి వెళ్లారు. అక్కడ మాటా.. మాటా పెరిగింది. గొడవ పెరిగింది.

ఈ క్రమంలో శ్రీవిద్య.. లక్ష్మీలపై దౌర్జన్యానికి దిగినట్లుగా చెబుతున్నారు. మరోవైపు దీనికి సంబంధం లేని రీతిలో మరో వాదన వినిపిస్తోంది. సమీర్.. స్వాతి ఇద్దరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేలా కవ్వించారని చెబుతున్నారు. సమీర్ సెలబ్రిటీ కావటం.. అతడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. మరోవైపు.. స్వాతి సైతం పెద్ద పెద్దగా అరవటం.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి.

ఇరు వర్గాల వారు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. దీంతో.. ఈ విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇలాంటి సమయంలో.. సమీర్ తాగిన మైకంలో మహిళల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారని.. అమానుషంగా ప్రవర్తించారని తీర్పులు చెప్పేయటం పొరపాటే అవుతుంది. ఎందుకంటే.. లైంగిక వేధింపులకు గురి చేస్తే.. అతడి పక్కనున్న స్వాతి అనే మహిళ కూడా ఉంది కదా? మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సమీర్.. స్వాతికి సంబంధించిన వీడియోక్లిప్పులు మాత్రమే బయటకు వచ్చాయి కానీ.. బాధితులుగా చెబుతున్న మరో ఇద్దరికి సంబంధించిన వీడియోలు ఎందుకు రావటం లేదన్నది ప్రశ్న. ఏమైనా.. తొందరపాటుగా ముద్ర వేసే కన్నా.. పోలీసుల విచారణ పూర్తి అయ్యే వరకు వెయిట్ చేయటం మంచిదన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News