కాష్మోరా.. ముందే జాగ్రత్త పడ్డారు

Update: 2016-10-27 09:25 GMT
ఒకప్పట్లా మూడు గంటల సినిమాలు తీస్తే చూసే పరిస్థితి లేదు ఇప్పుడు. నిడివి రెండున్నర గంటలన్నా అమ్మో అంటున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం చాలా వరకు సినిమాల లెంగ్త్ రెండుంబావు గంటలకే పరిమితమవుతోంది. ఇలాంటి తరుణంలో 2 గంటల 44 నిమిషాల నిడివితో ‘కాష్మోరా’ చిత్రాన్ని తెరకెక్కించాడు యువ దర్శకుడు గోకుల్. ఐతే ముందు సినిమా రిలీజ్ చేసి.. లెంగ్త్ ఎక్కువైందన్న ఫిర్యాదులు విని రిలీజ్ తర్వాత కోతలు పెట్టుకోవడం కంటే.. సినిమా మీద కొంచెం మమకారం తగ్గించుకుని ముందే జాగ్రత్త పడితే మేలని భావించింది ‘కాష్మోరా’ టీం. 12 నిమిషాలు ముందే కోత వేసి సినిమా నిడివిని 2 గంటల 32 నిమిషాలకు తగ్గించేసింది.

ఈ ఎడిటెడ్ వెర్షనే థియేటర్లలోకి వెళ్తోంది. ఇది మంచి ఎత్తుగడగా భావిస్తున్నారు. ఎందుకంటే ‘కాష్మోరా’కు ప్రధాన ఆకర్షణగా భావిస్తున్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉండేది కేవలం అరగంటే. మిగతా కథ రెండుంబావు గంటలు సాగితే ప్రేక్షకుల్ని ఎంత వరకు ఎంగేజ్ చేస్తుందన్నది సందేహం. కాబట్టే ముందే కత్తెర పడటం మంచే చేస్తుందని భావిస్తున్నారు. పీవీపీ సంస్థ రూ.60 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ‘కాష్మోరా’లో కార్తి మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నాడు. నయనతార.. శ్రీదివ్య కథానాయికలుగా నటించిన ఈ సినిమా శుక్రవారం తమిళ.. తెలుగు భాషల్లో భారీ అంచనాల మధ్య విడుదలవుతోంది. తెలుగులో మాత్రమే ఈ చిత్రం 600 థియేటర్లలో రిలీజవుతోంది.
Tags:    

Similar News