మాటల్లేవ్.. భయపడటమే

Update: 2018-04-10 04:30 GMT
ఎన్ని సినిమాలు వచ్చినా హర్రర్ అండ్ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. సినిమా ఎంతగా భయపెడితే అంత ఇష్టపడతారు. ఈమధ్య కాలంలో హర్రర్ కామెడీ సినిమాల ట్రెండ్ కొంతకాలం నడవడంతో ఆ తరహా సినిమాలు తెగ వచ్చాయి. అవి రొటీన్ అయిపోవడంతో తిరిగి ప్యూర్ హర్రర్ సినిమాల వైపు ఫిలిం మేకర్లు చూస్తున్నారు.

ప్యూర్ హర్రర్ సినిమాల్లో విజువల్స్ కన్నా అత్యంత భయపెట్టేది సౌండ్. సరిగ్గా ఫోకస్ పెడితే సౌండ్ తో ఏ రేంజ్ లో భయపెట్టొచ్చో తెలియజేసేలా మెర్క్యురీ సినిమా వస్తోంది. ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా పేరుకు తీసింది తమిళంలో అయినా వాస్తవానికి ఇది నో లాంగ్వేజ్ సినిమా. అంటే ఇందులో డైలాగులంటూ ఏవీ ఉండవు. కేవలం కథలో భాగంగా శబ్దాలే ఉంటాయి. అవి ఎంతలా భయపెడతాయనేది ట్రైలర్ చూసిన వారెవరికైనా అర్ధమైపోతుంది. డైరెక్టర్ చిన్నచిన్న శబ్దాలతో ఒళ్లు గగుర్పొడిచేలా చేశారు.

భయానికి భాషంటూ ఏమీ ఉండదు. అందుకే దీనిని పలు భాషల్లో విడుదల చేస్తున్నామని డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ప్రకటించాడు. దాదాపు 30 సంవత్సరాల తరవాత ఈ తరహా ప్రయోగంతో సినిమా వస్తుండడం విశేషం. ‘‘ఈ సినిమాలో లీడ్ రోల్ కు ప్రభుదేవా అయితేనే న్యాయం చేస్తాడనిపించింది. కథ రాసినప్పుడు ఆయనను దృష్టిలో పెట్టుకుని రాశాను. డైలాగులు ఉండవు కాబట్టి మిగతా టెక్నికల్ అంశాల్లో హై స్టాండర్డ్స్ ఉండేలా తెరకెక్కించాం’’ అంటూ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News