క‌రోనా దెబ్బ‌కు ఆ న‌లుగురిలో గుబులు!

Update: 2020-03-06 08:43 GMT
ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా అల్ల క‌ల్లోలం గురించి తెలిసిందే. సెన్సెక్స్ మార్కెట్ల‌నే కాదు.. సినిమా మార్కెట్ల‌ను తూట్లు పొడుస్తోంది ఈ వైర‌స్. ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌తో పాటు వ‌ర‌ల్డ్ సినిమాని అత‌లాకుత‌లం చేస్తోంద‌నే విశ్లేష‌ణ‌లు వెలువడుతున్నాయి. అయితే ఇలాంటి వేళ తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్ల‌ను బంద్ చేస్తారంటూ ఓ పుకార్ షికార్ చేసింది. దీనిపై గురువారం సాయంత్రం తెలుగు ఫిలింఛాంబ‌ర్ నుంచి కీల‌క నిర్ణ‌యం వెలువ‌డనుంద‌ని ఆ మేర‌కు స‌మావేశం జ‌రుగుతోంద‌ని ప్ర‌చార‌మైంది. ఇంత‌కీ ఈ స‌మావేశంలో ఏం తీర్మానించారు? నిన్న‌టి సాయంత్రం పెద్ద‌ల స‌మావేశంలో డెసిష‌న్ ఏమిటి? అంటే... ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తులే తెలిశాయి.

క‌రోనా భ‌యం ఉన్నా థియేట‌ర్ల‌ను బంద్ చేసేది లేద‌ని సినీపెద్ద‌లు ఆ స‌మావేశంలో తీర్మానించార‌ని తెలుస్తోంది. అయితే థియేట‌ర్ ప‌రిస‌రాల్ని ప‌రిశుభ్రంగా ఉంచ‌డంతో పాటు ప్రేక్ష‌కులంద‌రికీ మాస్క్ లు ధ‌రించేలా జాగ్ర‌త్త‌లు తీసుకోనున్నార‌ట‌. థియేట‌ర్ క్యాంటీన్ల‌లో ఆహారాన్ని ప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణంలో వండాల‌ని నిర్ణ‌యించార‌ట‌. ఇక థియేట‌ర్ల విష‌యంలో ప్ర‌భుత్వం ఏ నిర్ణ‌యం తీసుకున్నా దానికి క‌ట్టుబ‌డి ఉండాల‌ని పెద్ద‌లు తీర్మానించారు.

అంతా బాగానే ఉంది కానీ.. క‌రోనా కేసులు అంత‌కంత‌కు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతూ ఉంటే జ‌నం ఇళ్ల నుంచి బ‌య‌టికి వ‌స్తారా? అన్న‌దే అస‌లు చిక్కు ప్ర‌శ్న‌. పైగా గుంపులు గుంపులుగా ఉండే చోట తిరిగేందుకు ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. ఇప్ప‌టికే క‌రోనా వ‌ల్ల ముప్పు ఎలా ఉందో వీడియోల్లో ఫోటోల్లో చూసి గ‌జ‌గ‌జ‌ ఒణికిపోతున్నారు. థియేట‌ర్లు ఎలానూ శుభ్రంగా ఉండ‌వు. క్యాంటీన్లు అస‌లే శుభ్రంగా ఉండ‌వు! బొద్దింక‌లు లేని క్యాంటీన్ల‌ను అస‌లే చూడ‌లేం... ఇవ‌న్నీ ప్ర‌జ‌ల‌కు బాగా తెలుసు. ఎంత జాగ్ర‌త్త తీసుకున్నా ఎవ‌రూ చేసేదేమీ ఉండ‌దు. వైర‌స్ ప్ర‌భావంపై మీడియా దంచుడు చూసి ఇంపార్టెంట్ ప్ర‌యాణాలను కూడా క్యాన్సిల్ చేసుకుంటున్న ఈ జ‌నం అన‌వ‌స‌రంగా డ‌బ్బులు వ‌దిలించుకుని థియేట‌ర్ల‌కు వ‌స్తారా? మాబ్స్ మ‌ధ్య‌కు వ‌చ్చి తుమ్మే ద‌గ్గే వాళ్ల ద‌గ్గ‌ర నుంచి వైర‌స్ ని నెత్తికెత్తించుకుంటారా? అంటూ సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇక తాజాగా సినీపెద్ద‌లు తీసుకున్న నిర్ణ‌యం పూర్తిగా స్వార్థ పూరితంగా ఉంది త‌ప్ప ప్రేక్ష‌క శ్రేయ‌స్సును కోరే విధంగా లేద‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇక థియేట‌ర్లు బంద్ చేస్తే న‌ష్టం వ‌చ్చేది ఎవ‌రికి? అంటే ఆ న‌లుగురికి మాత్ర‌మే. అందుకే వీళ్లంతా ముంద‌స్తు స‌మావేశాల‌తో జాగ్ర‌త్త ప‌డుతున్నారా? అన్న సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి దీనికి అట్నుంచి స‌మాధాన‌మేమిటో!
Tags:    

Similar News