శివుడి పాత్రకు దూరం అయిన సీనియర్ ఎన్టీఆర్
తెలుగు సినిమా ఖ్యాతిని దశ దిశలూ వ్యాప్తి చేసిన మహనీయుడు అద్భుతమైన నటుడు ఎన్టీఆర్. ఆయన వేయని పాత్ర లేదు, ఆయన చేయని సాహసం లేదు, ముఖ్యంగా పౌరాణిక పాత్రలకు ఎన్టీఆర్ పెట్టింది పేరు.;
తెలుగు సినిమా ఖ్యాతిని దశ దిశలూ వ్యాప్తి చేసిన మహనీయుడు అద్భుతమైన నటుడు ఎన్టీఆర్. ఆయన వేయని పాత్ర లేదు, ఆయన చేయని సాహసం లేదు, ముఖ్యంగా పౌరాణిక పాత్రలకు ఎన్టీఆర్ పెట్టింది పేరు. ఆయన దాదాపుగా అన్ని పౌరాణిక పాత్రలను పోషించారు. ఇక ఎన్టీఆర్ తన మొత్తం మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో రాముడు కృష్ణుడు పాత్రలను ఎన్నో సార్లు ధరించారు. నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా వాటిని వెండి తెర మీద పండించి జీవం పోశారు. అయితే ఎన్టీఆర్ ఒకే ఒక పౌరాణిక పాత్ర మాత్రం ఒకసారి చేసిన తరువాత పూర్తిగా దూరం అయ్యారు. ఇంతకీ ఆ పాత్ర ఏమిటి అంటే అదే ఆసక్తికరమైన విషయం.
దక్ష యజ్ఞం సినిమాలో :
ఎన్టీఆర్ మాయా బజార్ నుంచే పౌరాణిక సినిమాలలో జోరు పెంచారు ఆ వరస అలా కొనసాగుతూ అరవై దశకంలోనూ ఎన్నో సినిమాలు నటించారు. అందులో అరవై దశకం తొలినాళ్ళలో వచ్చిన దక్ష యజ్ఞం మూవీ ఒకటి. అందులో పరమ శివుడిగా అద్భుతంగా ఆయన తన నటన చూపించారు. అందులో ఆయన శివుడిగా నర్తించిన సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. ఆ సినిమాలో శివుడు అంటే ఇలాగే ఉండాలి అనిపించేలా నందమూరి వారు తన అందంతో అభినయంతో ఆకట్టుకున్నారు. ఆ సినిమా విజయవంతం కూడా అయింది.
యాంటీ సెంటిమెంట్ గా :
ఐతే దక్ష యజ్ఞం మూవీ సమయంలోనే ఆయన పెద్ద కుమారుడు మరణించడం జరిగింది. దాంతో ఆయన తీవ్రంగా కలత చెందారు. శివుడి పాత్ర పోషించడం వల్లనే ఇలా జరిగిందా అని కూడా ఆయన సన్నిహితుల నుంచి కూడా వ్యాఖ్యానాలు వచ్చాయని చెబుతారు. మరి ఏమి జరిగిందో తెలియదు కానీ ఆ మూవీ తరువాత ఆయన శివుడు పాత్రను చేయకుండా దూరంగా ఉండిపోయారు. దాంతో శివుడిగా అన్న గారు నటిస్తే చూసే భాగ్యం అయితే ఆంధ్ర జనాలకు లేకుండా పోయింది.
ఎన్నో పురాణ గాధలు :
శివుడు అంటే పౌరాణిక గాధలో ఒక వీరోచితమైన రూపంగా ఉంటుంది. శివుడి మహిమలు ఆయన చూపించే ఆవేశం అలాగే కురిపించే కరుణ ఇవ్వన్నీ కూడా అనేక కధనాలుగా పురాణాలలో కనిపిస్తాయి. ఎన్టీఆర్ వంటి మహా నటుడు శివుడి వేషం వేసి ఉంటే మరిన్ని మంచి చిత్రాలు వచ్చి ఉండేవి అన్న భావన కూడా ఉంది. కానీ అన్న గారు మాత్రం శివుడి పాత్రలకు దూరం పాటిస్తూ వచ్చారు. ఆయన తన సినీ జీవితంలో అలా పురాణ పాత్రలలో ఈ విధంగా చేయడం ఒక అరుదైన విషయంగానే చెబుతారు. ఏది ఏమైనా దక్ష యజ్ఞం మూవీ మాత్రం శివ భక్తులకు ఫేవరేట్ మూవీగానే ఉంటుంది. ఎపుడు మహా శివరాత్రి వచ్చినా ఆ మూవీని టీవీలలో చూస్తూ అంతా పరవశించిపోతారు. అచ్చం మహా శివుడే దిగి వచ్చాడా అన్నట్లుగా ఎన్టీఆర్ అభినయం కూడా ఉంటుంది.