థియేట‌ర్ల‌ ముందు మెగాస్టార్‌కి పెట్టిన‌ట్టు జాక్స‌న్‌ క‌టౌట్లు పెడ‌తారేమో!

పాప్ చ‌క్ర‌వ‌ర్తి మైఖేల్ జాక్సన్ (ఎంజే)కు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గ‌త కొద్దిరోజులుగా ఈ బ‌యోపిక్ గురించి తెలుగు రాష్ట్రాల్లోను విప‌రీత‌మైన చ‌ర్చ సాగుతోంది.;

Update: 2026-02-15 06:09 GMT

పాప్ చ‌క్ర‌వ‌ర్తి మైఖేల్ జాక్సన్ (ఎంజే)కు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గ‌త కొద్దిరోజులుగా ఈ బ‌యోపిక్ గురించి తెలుగు రాష్ట్రాల్లోను విప‌రీత‌మైన చ‌ర్చ సాగుతోంది. 24 ఏప్రిల్ 2026న విడుదల కాబోతున్న `మైఖేల్` బయోపిక్ తెలుగు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. తెలుగు యువతలో ఈ సినిమాపై ఉన్న ఉత్కంఠను చూస్తుంటే.. ఇది కేవలం ఒక హాలీవుడ్ సినిమాగా కాకుండా.. మన ఇంటి సినిమాగా సంచ‌ల‌నాలు సృష్టిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

దీనికి సంబంధించి సోషల్ మీడియా ట్రెండ్స్ ప‌రిశీలిస్తే.. ప్రస్తుతం ఎక్స్, ఇన్‌స్టా రీల్స్‌లో తెలుగు ఎడిటెడ్ వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మైఖేల్ జాక్సన్ వేగవంతమైన స్టెప్పులకు చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ల మాస్ పాటలను జత చేస్తూ `మాష్-అప్` వీడియోలను వైర‌ల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఇప్పుడే ``ఎంజే ఈజ్ బ్యాక్`` అంటూ పోస్టర్లు షేర్ చేస్తున్నారు. నిజానికి హాలీవుడ్ సినిమాలకు అరుదుగా ఒక దృశ్యం మునుముందు చూడ‌బోతున్నామా? అనే సందేహాలు పుట్టుకొస్తున్నాయి. నిజానికి కటౌట్ల హంగామా, పాలాభిషేకాలు హాలీవుడ్ సినిమాల‌కు లేవు. మైఖేల్ బ‌యోపిక్ దీనిని తిర‌గ‌రాస్తుంద‌ని భావిస్తున్నారు. రిలీజ్ రోజున తెలుగు థియేటర్ల వద్ద జాక్స‌న్ కి క‌టౌట్లు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

దీనికి కార‌ణం ఈ నెల ఆరంభంలో విడుదలైన మైఖేల్ ట్రైలర్ తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ పొందింది. ఇక బ‌యోపిక్ లో న‌టించిన జాఫర్ జాక్సన్ మేజిక్ ఒక రేంజులో వ‌ర్క‌వుటైంది. మైఖేల్ జాక్సన్ సోద‌రుడి కుమారుడు జాఫర్ జాక్సన్. అత‌డు అచ్చం తన బాబాయిలాగే కనిపించడమే కాకుండా.. అతడి వాయిస్, డ్యాన్స్ మూమెంట్స్‌ను అద్భుతంగా పట్టుకున్నారు. దీనివల్ల పాత తరం వారితో పాటు ఇప్పటి యువతలోనూ నోస్టాల్జిక్ ఫీల్ క‌నిపిస్తోంది. అంతేకాదు.. కేవలం జాక్స‌న్ డ్యాన్స్‌కే పరిమితం కాకుండా.. అతడి బాల్యం..తండ్రితో ఉన్న విభేదాలను ఎమోషనల్‌గా చూపించడంతో తెలుగు ప్రేక్షకులు ఈ కథకు బాగా కనెక్ట్ అవుతార‌ని భావిస్తున్నారు.

ఇటీవల కాలంలో హాలీవుడ్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో, భార‌త‌దేశంలోను గొప్ప ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. అవతార్, ఓపెన్‌హైమర్, ఫైన‌ల్ డెస్టినేష‌న్ 6, టామ్ క్రూజ్ మిష‌న్ ఇంపాజిబుల్ సిరీస్ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు రాబట్టాయి. మైఖేల్ జాక్సన్ పేరుకు ఉన్న పాపులారిటీ దృష్ట్యా ఈ సినిమాను తెలుగులో భారీ ఎత్తున డబ్బింగ్ చేసి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజే రూ. 5-9 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని కూడా ట్రేడ్ విశ్లేసిస్తోంది. ఇది ఒక హాలీవుడ్ బయోపిక్‌కు చాలా పెద్ద మొత్తం. నాన్ అవ‌తార్ కేట‌గిరీలో ఇది సంచ‌ల‌నం సృష్టిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

మైఖేల్ జాక్సన్ అంటే అభిమానుల‌కు ఒక ఎమోషన్. ఆయన జీవితంలోని చీకటి కోణాలు, ప్రపంచాన్ని ఊపేసిన మ్యూజిక్ షోలు వెండితెరపై ఎలా ఉంటాయో చూడాలని తెలుగు యువత సర్వత్రా సిద్ధమవుతోంది. హాలీవుడ్ మేకర్స్ ఊహించిన దానికంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు ఎక్కువ బజ్ ఉండటం విశేషం.






Tags:    

Similar News