ఐఎండిబి సర్వే: 'దురంధర్ 2' కంటే 'టాక్సిక్' పైనే ఎక్కువ ఆసక్తి
కన్నడ రాకింగ్ స్టార్ యష్ కేవలం ఒక ప్రాంతీయ హీరో కాదు..అతడు గ్లోబల్ ఐకాన్. తాజాగా ఐఎండిబి ప్రకటించిన `మోస్ట్ అవైటెడ్ మూవీస్` జాబితాలో `టాక్సిక్` అగ్రస్థానంలో నిలవడమే దీనికి నిదర్శనం.;
కన్నడ రాకింగ్ స్టార్ యష్ కేవలం ఒక ప్రాంతీయ హీరో కాదు..అతడు గ్లోబల్ ఐకాన్. తాజాగా ఐఎండిబి ప్రకటించిన `మోస్ట్ అవైటెడ్ మూవీస్` జాబితాలో `టాక్సిక్` అగ్రస్థానంలో నిలవడమే దీనికి నిదర్శనం. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన `ధురంధర్ 2`ని వెనక్కి నెట్టి మరీ యష్ సినిమా నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
యష్ మూవీపై క్యూరియాసిటీ ఉండటానికి ప్రధాన కారణాలు... కేజీఎఫ్ ఇంపాక్ట్ అనడంలో సందేహం లేదు. యష్ సినిమా అంటే ఆ అంచనాలు వేరే లెవల్‌లో ఉండటానికి ప్రధాన కారణం కేజీఎఫ్ సిరీస్. రాకీ భాయ్ పాత్రతో యష్ పండించిన మాస్ మేనరిజమ్స్, ఎలివేషన్స్ దేశవ్యాప్తంగా ఉన్న మాస్ ఆడియన్స్‌కు విపరీతంగా కనెక్ట్ అయ్యాయి. ఆ సినిమా తర్వాత యష్ నుంచి రాబోతున్న తదుపరి చిత్రం కావడంతో `టాక్సిక్`పై సహజంగానే విపరీతమైన క్యూరియాసిటీ ఏర్పడింది.
ఒకప్పుడు బాలీవుడ్ హీరోలకే ఉత్తరాదిన మాస్ ఫాలోయింగ్ ఉండేది. కానీ యష్ ఆ సమీకరణాలను మార్చేశారు. `KGF 2` హిందీ వెర్షన్ సాధించిన వసూళ్లు సుమారు 434 కోట్ల నెట్. ఈ సినిమా గ్రాస్ వసూళ్ల పరంగా 1000 కోట్ల క్లబ్ లో చేరింది. రణ్‌వీర్ సింగ్ నటించిన ఏ సినిమా కూడా ఇది సాధించలేదు. యష్ నడక, స్టైల్, గంభీరమైన వాయిస్ హిందీ బెల్ట్‌లోని యువతను అమితంగా ఆకర్షించాయి. అందుకే రణ్‌వీర్ `ధురంధర్ 2` కంటే యష్ `టాక్సిక్` కోసం నార్త్ ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
టీజర్ కలిగించిన ప్రకంపనాలు:
`టాక్సిక్` అనౌన్స్‌మెంట్ టీజర్ వచ్చినప్పుడు అందులో యష్ లుక్ , బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. ఇది కేవలం ఒక లోకల్ గ్యాంగ్‌స్టర్ కథ కాదని.. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉండే డ్రగ్ డీల్స్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిదని అర్థం కావడంతో హైప్ రెట్టింపు అయ్యింది. ఈ సినిమా కోసం యష్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకోవడం కూడా ప్లస్ అయ్యింది.
యష్ కేజీఎఫ్ ఫ్రాంఛైజీ తర్వాత తన తదుపరి సినిమా కోసం మాస్ దర్శకుడిని కాకుండా, జాతీయ అవార్డు గ్రహీత `గీతూ మోహన్ దాస్` వంటి ప్రతిభావంతురాలైన మహిళా దర్శకురాలిని ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. యాక్షన్, ఎమోషన్ కలగలిసిన ఒక కొత్త తరహా సినిమాను యష్ అందిస్తారనే నమ్మకం అందరిలోనూ ఉంది.
ప్రస్తుతం IMDbలో 32.4 శాతం మంది యూజర్లు `టాక్సిక్` కోసం వెతుకుతుండటం చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయమనిపిస్తోంది. ఐఎండిబి ప్రకారం... మోస్ట్ అవైటెడ్ `టాక్సిక్` 32.4 శాతం షేర్ తో మొదటి స్థానంలో నిలిచింది. రణ్‌వీర్ సింగ్ నటించిన `ధురంధర్ 2: ది రివెంజ్` కేవలం 19.9 శాతం షేర్‌తో రెండో స్థానంలో ఉంది. యష్ సినిమా తన సమీప ప్రత్యర్థి కంటే సుమారు 32.4 శాతం పైగా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఐఎండిబి పేజీ వ్యూస్, యూజర్ యాక్టివిటీలో రికార్డులు సృష్టిస్తోంది.