ఆ సినిమాల సంగతేంటి కమల్?

Update: 2017-09-23 06:50 GMT
మొత్తానికి కమల్ హాసన్ దోబూచులాటకు తెరదించేశాడు. తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు.. కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు స్పష్టం చేశాడు. కొన్ని నెలల్లోనే ఆయన రాజకీయ కార్యాచరణ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కమల్ అభిమానులకు ఓవైపు ఆనందాన్నిస్తూనే.. మరోవైపు బాధ కలిగిస్తోంది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల్లో ఒకడైన కమల్ హాసన్ ను మళ్లీ తెరమీద చూడలేమేమో అన్న ఆందోళనలో ఉన్నారు కమల్ అభిమానులు. ఇప్పటికే కమల్ తెరమీద కనిపించి రెండేళ్లవుతోంది. ఎప్పుడో 2015లో ‘చీకటి రాజ్యం’ సినిమాలో కనిపించాడు కమల్.

ఆ తర్వాత ‘శభాష్ నాయుడు’ అనే సినిమాను ఒకేసారి మూడు భాషల్లో మొదలుపెట్టాడు. ఆ సినిమా చిత్రీకరణ మధ్యలో ఉండగానే ఆయనకు యాక్సిడెంట్ అయి.. కాలు విరిగింది. గాయం నుంచి కోలుకున్నప్పటికీ ఆ సినిమాను పున:ప్రారంభించలేదు. తన ట్విట్టర్ పేజీలో కవర్ ఫొటోగా ఈ పోస్టరే పెట్టుకున్నాడు కానీ.. దాని గురించి అస్సలు మాట్లాడట్లేదు కమల్. మరోవైపు చాలా ఏళ్లుగా మరుగున పడి ఉన్న ‘విశ్వరూపం-2’ను మళ్లీ బయటికి తీసి పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టినట్లు.. ఈ ఏడాదే విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు కానీ.. ఇప్పుడు దాని ఊసు కూడా ఎత్తట్లేదు. ఇంకో రెండు మూడు ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉండగా.. కమల్ పొలిటికల్ టర్న్ తీసుకున్నాడు. శంకర్ తో ‘భారతీయుడు-2’ చేయొచ్చన్న ప్రచారం కూడా జరిగింది. మరోవైపు కమల్ కలల సినిమా ‘మరుదనాయగం’ను పూర్తి చేయాలని కూడా కమల్ ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు. కమల్ కొత్తగా సినిమాలు చేయకపోయినా.. ఈ పెండింగ్ ప్రాజెక్టులైనా పూర్తి చేసి రాజకీయాల్లో అడుగుపెడితే బాగుంటుందన్నది ఆయన అభిమానుల ఆకాంక్ష.
Tags:    

Similar News