చీక‌టి రోజుల్ని గుర్తు చేసుకున్న సుంద‌రాంగి!

Update: 2018-04-07 17:30 GMT
సక్సెస్ చేతిలో ఉన్న‌ప్పుడు గ‌తాన్ని మ‌ర్చిపోవ‌టం మామూలే. కానీ.. కొంద‌రు అందుకు మిన‌హాయింపు. వ‌ర్త‌మానం ఎంత ఊపులో ఉన్నా.. గ‌తాన్ని ఏ మాత్రం మ‌ర్చిపోరు. అలాంటి కోవ‌కే చెందుతారు బాలీవుడ్  ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌. స్టార్ హీరోల‌తో జ‌త క‌డుతున్న ఈ శ్రీ‌లంక భామ ఒక‌ప్పుడు అవ‌కాశాల కోసం తానెంత‌లా త‌పించిన విషయాన్ని చెప్ప‌ట‌మే కాదు.. గ‌తంలో తాను చూసిన చీక‌టి రోజుల గురించి పెద‌వి విప్పింది.

త‌న‌కున్న స్టార్ హోదాను ప‌క్క‌న పెట్టి.. ఒక‌ప్పుడు చూసిన చీక‌టి రోజుల గురించి చెబుతూ.. అలాంటి రోజులు ఇంకెప్పుడు రాకూడ‌ద‌ని అనుకుంటుంటాన‌న్న ఆమె.. ఓ రెండు సంవ‌త్స‌రాలు త‌న జీవితంలో ఎలా గ‌డిచాయో త‌న‌కే తెలీదంది.

అవ‌కాశాలు రాక‌.. ఎవ‌రి నుంచి ఎలాంటి పిలుపు లేక తీవ్ర‌మైన అభ‌ద్ర‌తాభావంతో ఉండేదానిన‌ని వెల్ల‌డించింది. ప్ర‌తికూల ఆలోచ‌న‌ల‌తో ఆత్మ‌విశ్వాసం అస్స‌లు ఉండేది కాద‌న్న ఆమె.. "అప్ప‌ట్లో ప్ర‌తికూల ఆలోచ‌న‌లు మ‌న‌సును తొలిచేసేవి. కిక్ మూవీని ఓకే చేయ‌టానికి నెల ముందు నాన్న‌తో క‌లిసి వాటిక‌న్ సిటీకి టూర్ కు వెళ్లాను. ఆ స‌మ‌యంలో నా చేతిలో ఒక్క సినిమా లేదు. ఎవ‌రి నుంచి పిలుపు వచ్చేది కాదు. జీవితంలో అదే లాస్ట్ టూర్ అనుకున్నా. ఎందుకంటే.. విహార యాత్ర‌ల‌కు వెళ్లేంత ఆర్థిక స్తోమ‌త నాకు ఉండ‌దేమోన‌న్న బాధ క‌లిగింది. అమ్మానాన్న‌ల‌కు ప్ర‌పంచాన్ని చూపించాల‌న్న నా ఆశ తీర‌దేమోన‌ని అనిపించేది. ఆ బాధ గుండెల్ని పిండేసేది" అంటూ గ‌తం గురించి ఓపెన్ అయ్యింది.

ఎలా అయినా సాధించాల‌న్న క‌సి.. తాను కోరుకున్న రంగంలో నిల‌దొక్కుకోవాల‌న్న ప్ర‌య‌త్నం త‌న‌ను ఈ రోజున ఇప్పుడున్న స్థానంలో నిలిపాయ‌ని చెప్పింది. కిక్ మూవీతో తొలి స‌క్సెస్ అందుకున్న జాక్వెలిన్ ఇక వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం రాలేదు. త్వ‌ర‌లో ఆమె న‌టించిన రేస్ 3పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. స‌ల్మాన్ తో జ‌త క‌ట్టిన ఈ మూవీ జాక్వెలిన్ కెరీర్ కు మ‌రింత మేలు చేస్తుంద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News