యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ వెనుక అసలు రహస్యం ఇదేనా..?

Update: 2021-06-24 13:30 GMT
ఇప్పుడు సినిమాల ప్రమోషనల్ కంటెంట్ కు సోషల్ మీడియాలో వచ్చే రెస్పాన్స్ ను బట్టి బజ్ క్రియేట్ అయినట్లు లెక్కగడుతున్నారు. అందుకే మా సినిమా ట్రైలర్ కు 24 గంట‌ల్లో ఇన్ని మిలియ‌న్ వ్యూస్ - లైక్స్ వచ్చాయని.. పాటలను యూట్యూబ్ లో ఇంతమంది చూశారాని ప్రచారం చేసుకోవడం ఎక్కువైపోయింది. టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ ఇదేనని హీరోలు ఫీల్ అవుతున్నారు. వారి అభిమానులు కూడా మా హీరో టీజర్ రికార్డులు సృష్టిస్తోందని హంగామా చేస్తున్నారు. అయితే ఈ రియల్ టైం వ్యూస్ - ఆర్గానిక్ వ్యూస్ వెనుక యూట్యూబ్ వ్యూస్ మాఫియా ఉందని తెలుస్తోంది.

'బాహుబ‌లి' వంటి ఎక్స‌ట్రార్డ‌న‌రీ కంటెంట్ ని థియేట‌ర్ లో టికెట్ కొని చూసిన తెలుగు వారు ఒక కోటి 80 ల‌క్ష‌లు మంది ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్ ను చూసేవారి సంఖ్య  4 కోట్ల వరకు ఉంటుంద‌ని అంచ‌నా. ఆ లెక్క‌న యూట్యూబ్ చేసేవారిలో 10 శాతం మాత్ర‌మే తెలుగు సినిమా కంటెంట్ చూస్తారనుకోవచ్చు. దీనిని బట్టి చూస్తే తెలుగులో విడుద‌లయ్యే టీజ‌ర్ లేదా ట్రైలర్ కి 4 మిలియ‌న్ల వ్యూస్ దాట‌కూడ‌దు. యావరేజ్ గా ఒక్కొక్కరు రెండుసార్లు చూస్తారనుకున్నా వ్యూస్ 8 మిలియ‌న్స్ దాట‌వు. కానీ ఇప్పుడు తెలుగులో విడుద‌ల‌య్యే ప్ర‌తి హీరో టీజ‌ర్ లేదా ట్రైలర్ మినిమ‌మ్ మిలియ‌న్ వ్యూస్ దాటుతోంది. అయితే ఈ మినిమ‌మ్ మిలియ‌న్ వ్యూస్ అనేవి చిన్న హీరోల‌కు చిన్న సినిమాల‌కు రావ‌డం లేదు.

దీనిని కారణం తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్న పెద్ద హీరోలు.. డబ్బున్న హీరోలు యూట్యూబ్ వ్యూస్ కొనుక్కోవడమే అని టాక్ ఉంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసే వీడియోల వ్యూస్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారట. ఇది దేశమంతటా వైర‌స్ లా వ్యాపిస్తోందని అంటున్నారు. ఇప్పుడు యూట్యూబ్ లో మిలియ‌న్ వ్యూస్ అంటూ హ‌ల్ చ‌ల్ చేసే టీజర్లు - ట్రైల‌ర్స్ ట్రెండింగ్ లో ఉండటానికి పెయిడ్ ప్రమోషన్స్ కారణమనే టాక్ నడుస్తోంది. అయితే యూట్యూబ్ లో మిలియ‌న్స్ కొద్దీ వ్యూస్ వ‌చ్చినంత మాత్రాన అవి టిక్కెట్ రూపంలో తెగవనే విషయం వీళ్ళందరూ గుర్తు పెట్టుకోవాలి.
Tags:    

Similar News