ర‌త్తాలుకి నిజంగానే పెళ్లి కుదిరిపోతోందా?

Update: 2021-04-08 12:30 GMT
ర‌త్తాలు ఏం చేసినా అది చాలా స్పెష‌ల్ గా ఉంటుంది. అందుకే ర‌త్తాలు ర‌త్తాలు ఓసోసి రత్తాలు అంటూ ఖైదీనంబ‌ర్ 150 అంత‌టి వారే టీజ్ చేస్తూ  వెంట‌ప‌డ్డారు. అదంతా స‌రే కానీ.. రత్తాలు గ‌త కొంత‌కాలంగా సోష‌ల్ మీడియాల్లో విరుచుకుప‌డుతున్న తీరుకు నెటిజ‌నుల కంటికి కునుకుప‌ట్ట‌డ‌మే క‌రువైంది.

తాజాగా ర‌త్తాలు చేసిన ఓ ట్వీట్ కి అస‌లే నిదుర క‌రువ‌య్యే ప‌రిస్థితి నెల‌కొంది. ఇంత‌కీ ర‌త్తాలు అలియాస్ రాయ్ ల‌క్ష్మీ అంత ప‌ని ఏం చేసింది? అంటే... ఏప్రిల్ 27 న నిశ్చితార్థం కి సిద్ధ‌మ‌వుతున్నాన‌ని.. అందుకు త‌న కుటుంబం చాలా సంతోషంగా ఉంద‌ని రాయ్ లక్ష్మీ టీజ్ చేసారు. చాలా మంది చాలా కాలం నుండి నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నారు కాబట్టి నేను ఈ సమస్యను త్వ‌ర‌గా పరిష్కరించాలని నిర్ణయించుకున్నాను. మొదట నేను నా సంబంధాన్ని దాచడం లేదు. కాక‌పోతే నా భాగస్వామి  శ్రేయస్సును కాపాడటానికి నాకు కొంత గోప్యత అవసరం. అవును.. మేం గత వారం 27 ఏప్రిల్ 2021 న నిశ్చితార్థం చేసుకోబోతున్నాం. సన్నిహితులకు ఆహ్వానాలు పంపాము. ఇది ఊహించనిది. కానీ నా కుటుంబం ఇందుకు నిజంగా సంతోషంగా ఉంది. నేనూ హ్యాపీనే. జీవిత‌భాగ‌స్వామి కోసం వేచి చూడ‌లేను`` అంటూ రాయ్ ల‌క్ష్మీ సోష‌ల్ మీడియాలో వ్యాఖ్యానించారు.

అయితే చివ‌రిలోనే ఉంది అస‌లు ట్విస్టు.``మీరు మీ చేతులను సరిగ్గా కడుక్కోవాలి. అవసరమైనప్పుడు శానిటైజర్ వాడాలని మీకు గుర్తు చేయడానికి నేను ఈ పోస్ట్ ను ఒకరి నుండి దొంగిలించాను`` అంటూ రాయ్ ల‌క్ష్మీ ట్విస్ట్ ఇవ్వ‌గా.. ఈ పోస్ట్ చదివిన చాలా మంది తిట్ల దండ‌కం అందుకున్నారు. స‌గ‌మే చ‌దివిన వాళ్లంతా రాయ్ ల‌క్ష్మీకి నిజంగానే పెళ్లి కుదిరిపోతోంద‌‌ని నిశ్చితార్థం అయిపోతోంద‌ని కంగారు ప‌డ్డారు.

కోవిడ్ -19 కేసులు భారీగా పెరిగాయి. ల‌క్ష‌ల్లో కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలని తరచుగా హ్యాండ్ శానిటైజర్లను ఉపయోగించాలని రాయ్ లక్ష్మి గుర్తు చేశారు. మొత్తానికి నిశ్చితార్థం అంటూ హ‌డావుడి చేసి ఇదా చెప్ప‌ద‌లిచిన‌ది? అంటూ కొంద‌రు నెటిజ‌నులు వీరంగం ఆడుతున్నారు.
Tags:    

Similar News