మా ఆయనతో గొడవపడినప్పుడు ఆ పాటను గుర్తుచేసుకుంటాను: ఇంద్రజ

Update: 2021-08-31 09:21 GMT
తెలుగు తెరపై అందాల సందడి చేసిన నిన్నటితరం కథానాయికలలో ఇంద్రజ ఒకరు. మంచి హైటూ .. అందుకు తగిన ఆకర్షణీయమైన రూపం ఆమె సొంతం. తెలుగులో ఆమె చేసిన సినిమాలలో 'యమలీల' .. 'సొగసు చూడతరమా' .. 'పిట్టలదొర' మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. 'సొగసు చూడతరమా' సినిమాలో ఆమె నిజంగానే అజంతా శిల్పాన్ని అభిషేకించినట్టుగా కనిపిస్తారు. ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆమె బిజీగానే ఉన్నారు. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' వేదిక ద్వారా తన మనోభావాలను పంచుకున్నారు.

"మా ఇంట్లో వాళ్లంతా నన్ను కనకలక్ష్మి అని పిలిచేవారు .. అది మా నాయనమ్మ పేరు. మొదటి నుంచి కూడా నాకు చదువుకోవడమంటే ఇష్టం. అయితే కుటుంబ బాధ్యతల కారణంగా నేను అనుకున్నది చదవలేకపోయాను. ఒక అన్నయ్య ఉండి ఫ్యామిలీ బాధ్యతను మొత్తం తను తీసుకుని ఉంటే, నేను బాగా చదువుకునేదానిని కదా అని ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది. హీరోయిన్ ను కాకపోయి ఉంటే జర్నలిస్ట్ ను గానీ .. సైంటిస్టును గాని అయ్యుండేదానినేమో.

మా అమ్మగారు మ్యూజిక్ టీచర్ .. అలాగని నేను అమ్మ దగ్గర కూర్చుని సంగీతం నేర్చుకోలేదు. మా ఇంటికి పిల్లలు వచ్చి సంగీతం నేర్చుకుని వెళుతూ ఉండేవారు. వాళ్లు పాడుతూ ఉంటే వింటూ ఉండటం వలన నాకు కొంత సంగీత జ్ఞానం వచ్చింది. అంటూ వేదికపై ఆమె 'శుభలగ్నం' సినిమాలోని 'చిలకా ఏతోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక .. ' అనే పాట పాడారు. ఆ తరువాత ఆమె మాట్లాడుతూ .. "ఈ పాట అంటే నాకు పిచ్చి. నాకు మా ఆయనకు ఏదైనా కీచులాటలు జరిగినప్పుడు .. గొడవలు వచ్చినప్పుడు నాకు ఈ పాట గుర్తొస్తుంది.

ముఖ్యంగా ఈ పాటలోని 'మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాక ..' అనే లైన్ నాకు గుర్తుకు వస్తుంది. వెంటనే నేను ఆలోచన చేసుకుని వెనక్కి తగ్గుతాను .. గొడవ వద్దనుకుని కూల్ అవుతాను. కొంతసేపు ఓపిక పడితే అంతా సర్దుకుంటుందని ఓపిక పడతాను. అలాగే మా మధ్య జరిగిన ఏ గొడవ కూడా ఒక నైట్ ఎప్పుడూ దాటలేదు. ఆ తరువాత ఆయనే అర్థం చేసుకుని వచ్చేస్తారు. మరుసటి రోజుకు మామూలైపోతాము. ఈ ఒక్క పాట మాత్రమే కాదు, ఎస్వీ కృష్ణారెడ్డి గారి సంగీతంలో వచ్చిన అన్ని పాటలూ నాకు ఇష్టమే. ఆయన సంగీతంలో వచ్చిన పాటల కలెక్షన్ నా దగ్గర ఇప్పటికీ ఉంది" అంటూ చెప్పుకొచ్చారు. 
Tags:    

Similar News