పిసినిగొట్టు హీరో వెన‌క 60 కుటుంబాలు

అయితే శోభ‌న్ బాబుకు ఎన్ని ఆస్తులు ఉన్నా కానీ, చాలా పిసినారి అని కూడా కొంద‌రు బిరుదు ఇచ్చారు.;

Update: 2025-12-23 04:57 GMT

`అంద‌గాడు` శోభ‌న్ బాబు ముందు చూపు ఎంద‌రికో ఆద‌ర్శం. ఆయ‌న సంప‌ద‌ల్ని సృష్టించ‌డంలోనే కాదు, వాటిని ఎక్కడ ఎలా తెలివిగా పెట్టుబ‌డి పెట్టాలో తెలిసిన‌వాడు. కేవ‌లం సినీప‌రిశ్ర‌మ వ్య‌క్తులే కాదు, ఆయ‌న అభిమానులు, ప్ర‌జ‌లు కూడా ఆయ‌న‌ను ఇప్ప‌టికీ అనుస‌రిస్తున్నారంటే ఎంత గొప్ప ఆదర్శ‌వంత‌మైన వ్య‌క్తి అనేది అర్థం చేసుకోవ‌చ్చు. ఈ ప్ర‌పంచంలో భూమి ఉన్న‌ది కేవ‌లం మూడోవంతు.. మిగ‌తాది అంతా స‌ముద్ర‌మే. అందువ‌ల్ల భూమిపై పెట్టుబ‌డి పెట్ట‌డం చాలా తెలివైన ఆలోచ‌న అని ఆరోజుల్లో శోభ‌న్ బాబు చెబుతుండేవారు. శోభ‌న్ బాబు త‌న సంపాద‌న‌ను మెజారిటీ భాగం భూమిపైనా, రియ‌ల్ ఎస్టేట్ లో పెట్ట‌డం వ‌ల్ల అవి వంద‌ల కోట్ల ఆస్తులుగా విరాజిల్లాయ‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. ఆయ‌న వార‌సులంద‌రినీ ఆరోజుల్లోనే ఉన్న‌త చ‌దువులు చదివించుకుని దేశ విదేశాల‌లో స్థిర‌ప‌డేలా చేయ‌గ‌లిగారంటే ఆయ‌న స్తిత‌ప్ర‌జ్ఞ‌త, జాగ్ర‌త్త గురించి ఎంత చెప్పినా త‌క్కువే.

అయితే శోభ‌న్ బాబుకు ఎన్ని ఆస్తులు ఉన్నా కానీ, చాలా పిసినారి అని కూడా కొంద‌రు బిరుదు ఇచ్చారు. అత‌డు దాన‌ధ‌ర్మాలు చేయ‌ర‌ని, బాగా పిసినిగొట్టు మ‌నిషి అని కూడా కామెంట్లు వినిపించేవి. అయితే ఇది నిజ‌మా? అంటే.. ఇది ఫ‌క్తు అస‌త్య ప్ర‌చారం అని ఆయ‌న పాత ఇంట‌ర్వ్యూ లో మాట‌లు నిరూపిస్తున్నాయి.

ఆయ‌న జీవించి ఉన్న కాలంలో, స్టార్ గా ఏల్తున్న రోజుల్లోనే ఒక ఇంట‌ర్వ్యూలో త‌న గురించి ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటారో నిజాయితీగా, స్ప‌ష్టంగా చెప్పారు శోభ‌న్ బాబు. దాన‌ధ‌ర్మాల విష‌యంలో ఎలా ఆలోచించాలో కూడా శోభ‌న్ బాబు చెప్పారు. అన్న‌గారు ఎన్టీఆర్ స‌ల‌హాను కూడా తాను పాటించిన‌ట్టు వెల్ల‌డించారు. త‌న అభిమానులంద‌రికీ త‌లా ఒక రూపాయి దాన‌మిచ్చినా తిరిగి తాను ఆ రూపాయి కోసం చేయి చాచాల్సి వ‌స్తుంద‌ని అన్న‌గారు ఎన్టీఆర్ త‌న‌తో అన్నార‌ని కూడా శోభ‌న్ బాబు ఈ ఇంట‌ర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. తాను ఎన్నో గుప్త‌దానాలిచ్చినా కానీ ఏనాడూ వాటిని బ‌య‌ట‌కు చెప్పుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేద‌ని తెలిపారు. అలా బ‌య‌ట‌కు తెలియ‌క‌పోవ‌డం వ‌ల్ల త‌న‌ను చాలామంది పిసినిగొట్టు అనుకుంటార‌ని అన్నారు.

తాను త‌న కుటుంబం, పిల్ల‌ల గురించి మాత్ర‌మే కాదు, త‌న‌పై ఆధార‌ప‌డి ప‌ని చేస్తున్న 60 కుటుంబాల కోసం ఆలోచిస్తాన‌ని కూడా శోభ‌న్ బాబు తెలిపారు. త‌న‌పై ఆధార‌ప‌డి జీవిస్తున్న ప‌ని వాళ్లు త‌న‌ను వ‌దిలి ఎప్ప‌టికీ వెళ్లిపోలేర‌ని కూడా మాట్లాడారు. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ప‌ని మ‌నుషుల కుటుంబాల‌కు, పిల్ల‌ల‌ భ‌విష్య‌త్ కు భ‌రోసానిస్తాన‌ని ఆయ‌న అన్నారు.

శోభ‌న్ బాబు ఎంత‌టి అంద‌గాడో, ఆయ‌న మ‌న‌సు కూడా అంత‌కుమించి విక‌సించిన అందంతో మెరుపులాగా క‌నిపిస్తోంది క‌దూ.. ఈ మాట‌లు వింటుంటే.. అందుకే తెలుగు సినిమా హిస్ట‌రీలో చెర‌గ‌ని ముద్ర వేసిన హీరోల‌లో శోభ‌న్ బాబు ఒక‌రు. ఆయ‌న త‌న న‌ట‌న‌తోనే కాదు, మంచి మ‌న‌సు, స‌హృద‌య‌త‌తోను, స‌త్ ప్ర‌వ‌ర్త‌న‌, క్ర‌మశిక్ష‌ణ‌తోను హృద‌యాల‌ను గెలుచుకున్నారు. త‌న విష‌యంలో కొన్ని అపార్థాలు ప్ర‌జ‌ల్లో ఉన్నా కానీ, ఆయ‌న ఆ ఇంట‌ర్వ్యూలో అన్నిటినీ ప‌టాపంచ‌లు చేసారు. శోభ‌న్ బాబు భూమిపై విరివిగా పెట్టుబ‌డులు పెట్టేవారు. ఆయ‌నను స్ఫూర్తిగా తీసుకుని భూమిపై పెట్టుబ‌డులు పెట్టిన‌ న‌టుడు ముర‌ళీ మోహ‌న్ వంద‌ల, వేల‌ కోట్ల `జ‌య‌భేరి రియ‌ల్ ఎస్టేట్` సామ్రాజ్యాన్ని సృష్టించిన‌ సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News